కేంద్ర కేబినెట్ విస్తరణకు వేళాయె !
జులై 3న మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి భేటీ
ప్రజా దీవెన/ దిల్లీ: కేంద్ర మంత్రివర్గం (Union Council of Ministers)లో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశమున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో జులై 3న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి భేటీ జరగనుండటం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయిందన్న వార్తలు దావానంలా వ్యాపిస్తున్నాయి.
వచ్చే సోమవారం (జులై 3న) ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రి మండలితో సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ప్రధాని మోదీ తన నివాసంలో భాజపా (BJP) సీనియర్ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.
లోక్‌సభ ఎన్నికలకు అమలు చేయాల్సిన వ్యూహాలతో పాటు మంత్రిమండలిలో మార్పులు గురించి కూడా ఇందులో చర్చించినట్లు సమాచారం. దీంతో త్వరలోనే కేబినెట్లో భారీ మార్పులు జరగనున్నట్లు వార్తలు మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే కేంద్ర మంత్రులతో ప్రధాని సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతమున్న మంత్రుల్లో కొందరికి ఉద్వాసన పలికి.. కొత్తవారికి చోటు కల్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది..