–పలు షాపుల ఆకస్మిక తనికి.. పలువురికి నోటీసులు
–నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
–అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి
Food Safety : ప్రజాదీవెన నల్గొండ : ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా, నల్గొండ పట్టణంలో రెండు రోజుల పాటు “ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్” (ఎఫ్ ఎస్ డబ్ల్యు) ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.. ఆగష్టు 6 నుంచి 7 వరకు ఎస్‌ఎల్‌బీసీ నుండి డీవీకే రోడ్, క్లాక్ టవర్, బస్టాండ్, మిర్యాలగూడ రోడ్డు కలెక్టరేట్ వరకు ఉన్న 60కి పైగా హోటళ్లు, కిరాణా దుకాణాలు, ఫ్రూప్ట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మాంసం దుకాణాలు, టీ స్టాల్స్, బేకరీలతో సహా వివిధ ఆహార వ్యాపార కేంద్రాలను ఆహార భద్రతా నిబంధనల మేరకు తనిఖీ చేశారు.
యాదాద్రి జోన్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి ఆదేశాల మేరకు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి డా. ఎన్. శివ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎం. వెంకటపతి (టెక్నీషియన్), ఎం. రమేష్ (నమూనా సహాయకుడు), ఎ. మహేష్ (డ్రైవర్) లు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ద్వారా “ఆహార భద్రతా డ్రైవ్”లో సిబ్బంది పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో పాలు, టీ పొడి, కారం, పసుపు, మసాలాలు, వంట నూనె, బిర్యానీ, స్వీట్స్, బేకరీ ఆహార పదార్దాలలో నిషిద్ధ రంగులు వాడకుండా, కొందరు చికెన్ సెంటర్ల నిర్వాహకులు అవగాహన రాహిత్యంతో రంగులు వాడుతున్నట్లు గుర్తించి నోటీసులు జారీచేయడం జరిగింది, అనుమానాస్పద పదార్థాలపై ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనంతో తక్షణ పరీక్షలు నిర్వహించారు. మిల్కోస్క్రీన్ సహాయంతో పాల నాణ్యత పరీక్షలు నిర్వహించాము, టీపీసీ మీటర్ సహాయంతో వంట నూనెల నాణ్యత పరీక్షలు నిర్వహించి పరిమితికి మించి వేడిచేసి వంటనూనెలను అక్కడిక్కడే ద్వాంసం చేసారు రోడ్ ప్రక్కన ఉన్న పండ్ల దుకాణాలలో తనిఖీలు నిర్వహించి నిషేధిత కార్బైడ్, ఆపిల్స్ పైన కృతిమ మైనపు కోటింగ్ వేస్తె కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులను అవగాహన కల్పించారు. అనుమతులు లేని వ్యాపారాలపై, పరిశుభ్రత పాటించని హోటళ్లపై నోటీసులు జారీ చేయబడ్డాయి. గడువు తీరిన, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆరోగ్యానికి హానికరమైన కొన్ని అనుమానాస్పద ఆహార పదార్థాలను స్వాధీనం చేసి అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
వ్యాపారులు నాన్-ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలలో, న్యూస్ పేపర్లు వంటివి ఆహారం నిల్వ చేయడానికి వాడరాదని, నిషిద్ధ రంగుల వినియోగం, పదేపదే నూనెను వాడటం వల్ల జీర్ణకోశ సంబంధ ఆరోగ్య సమస్యలు వస్తాయని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హెచ్చరించారు.
ఈ డ్రైవ్‌లో, నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలా ఉత్పత్తులపై నిషేధం ఉన్న అవగాహన లోపంతో కొన్ని చిన్న చిన్న దుకాణాలు, పాన్ షాపులలో అమ్ముతున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేసి, స్వాధీనం చేసుకున్న నిషేధిత పదార్థాలను వీడియో రికార్డు చేసి ధ్వంసం చేయనున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు. ఇటువంటి నిషేధిత పదార్థాల విక్రయంపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అన్ని ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ తీసుకొని, కల్తీకి పాల్పడకుండా నిబంధనల మేరకు వ్యాపారం నిర్వహించాలని, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని భవిష్యత్తులో ఇటువంటి తనిఖీలు మరింత కఠినంగా ఉంటాయని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి పేర్కొన్నారు. అనుమానాస్పద ఆహార వ్యాపారాలపై ప్రజలు నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు.