–ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి తలోగ్గి 65 లక్షల ఓట్లు తొలగింపు
–సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి విమర్శ
Tummala Veerareddy : ప్రజాదీవెన నల్గొండ : బీహార్ రాష్ట్రంలో జరుగబోతున్న ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా వున్న ఓట్లను తొలగించి, అక్రమ పద్ధతుల్లో అధికారంలోకి రావాలని బిజెపి కుట్రపన్నుతున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని సుభాష్ విగ్రహం వద్ద ఓట్ల తొలగింపును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు తొలగిస్తుంటే ఎన్నికల సంఘం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని అన్నారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి తలోగ్గడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని ఆరోపించారు. ఇందులో అత్యధికంగా మైనారిటీలు, ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లే వున్నాయని, బిజెపికి వ్యతిరేకంగా ఓట్లేస్తారని భావించి తొలగించిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలలో 40నుండి 60 శాతం ఓట్లను తీసేసిందన్నారు. ఎన్నికల కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అండదండలతో బిజెపి ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కుట్రపన్నుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం తమకు ఓటు వేయని ముస్లిం, మైనార్టీల, దళితులు, గిరిజనుల పౌరుసత్వాలను రద్దు చేసేందుకు దొడ్డి దారిన ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టారని విమర్శించారు.
బీహార్ లో ఎన్నికలవేళ 65 లక్షల ఓట్లను తొలగించారని తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈ ఓట్ల తొలగింపు పక్రియ చేపట్టనున్నారని చెప్పారు. ముఖ్యంగా తమకు ఓటు వేయని ముస్లింలు, క్రిస్టియన్లను పౌరసత్వం పేరుతో ఓట్లను తొలగించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పౌర సత్వానికి ఆధార్, ఇతర ధ్రువీకరణ పత్రాలకు అర్హత లేదని కేవలం తాత ముత్తాతల జన ధ్రువీకరణ పత్రాలు ద్వారానే నిరూపించుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించే కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్ హాశం, మహ్మద్ సలీం, గంజి మురళీధర్, పుచ్చకాయల నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, మల్లం మహేష్, నల్పరాజు సైదులు, తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, కుంభం కృష్ణారెడ్డి, ఔట రవీందర్, బొల్లు రవీందర్, కొండ వెంకన్న, ఊట్కూరు మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.