–యూరియాను వ్యవసాయేతర పనులకు వాడితే క్రిమినల్ కేసు నమోదు చేయండి
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకే సుమారు 70 శాతం మంది రైతులు యూరియాను కొనుగోలు చేశారని, జిల్లాలో ప్రణాళిక ప్రకారం యూరియాను రైతులకు అందించడం జరుగుతున్నదని అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో యూరియా, ఇతర ఎరువుల లభ్యత, నియంత్రణలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారి, ఇతర అధికారులతో సమీక్షిస్తూ యూరియాను వ్యవసాయేతర పనులకు వాడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒకవేళ ఎవరైనా వ్యవసాయానికి కాకుండా పరిశ్రమలు, ఇతర పనులకు వాడినట్లయితే అలాంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
యూరియా పక్కదారి పట్టకుండా పోలీస్, రెవిన్యూ, ఇతర అధికారులు, సిబ్బందితో ఏర్పాటుచేసిన టాస్క్ ఫోర్స్ కమిటీలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. యూరియా కొరతను అధిగమించేందుకు రైతులు ఒక పంట కాలంలో నానో యూరియాను వినియోగించాలని, నానో యూరియా వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని, ఈ విషయంపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఆమె ఆదేశించారు. అంతకు ముందు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ…. ఈ సంవత్సరం ముందుగానే వర్షాలు ప్రారంభం కావడం, కేంద్రం నుండి యూరియా సకాలంలో రాకపోవడం, అంతర్జాతీయ సమస్యల కారణంగా యూరియాకు కొరత ఏర్పడిందని అన్నారు. జింకు, డీఏపీ వంటి యూరియా ధరలు ఎక్కువగా ఉండటం, యూరియా ధర తక్కువగా ఉండడం వల్ల రైతులు యూరియాను ఎక్కువగా వాడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా, రైతుబంధు తదితర అన్ని సౌకర్యాలను ముందే కల్పించడం జరుగుతున్నదని, యూరియా వల్ల చెడ్డ పేరు రావడానికి వీల్లేదని తెలిపారు.
రానున్న 15 రోజులు జిల్లా కలెక్టర్లు యూరియా సరఫరా పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఎట్టి పరిస్థితిలో సమస్యలు రాకుండా చూసుకోవాలని, ఉన్న యూరియాను ఎక్కడ అవసరమో అక్కడ సరఫరా చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని, అంతేకాక రైతులు యూరియాను ఎక్కువ వాడకుండా ఎంత మోతాదులో వాడాలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఆగస్టు నెల మొత్తం జిల్లా కలెక్టర్లు పూర్తిగా మనసుపెట్టి పని చేయాలని, ఎట్టి పరిస్థితులలో యూరియా ఇతర అవసరాలకు వాడకూడదని, ప్రత్యేకించి పరిశ్రమలలో యూరియా దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లు ,ఎస్పీ లపై ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రఘునందన్ రావులు యూరియా పరిస్థితి పై జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవి, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.