— ఎంజియు ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్
Mahatma Gandhi University : ప్రజా దీవెన నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఐక్యూ ఏసీ ఆధ్వర్యంలో 2028లో జరగనున్న మూడవ విడత నాక్ మూల్యాంకనం పై సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కాకతీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు గోపికృష్ణ, ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త, ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ సీఈవో మారం గోన రెడ్డిలు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ అధ్యాపకులు ప్రతి ఒక్కరూ పరిశోధనపై దృష్టి సారించాలని, విశ్వవిద్యాలయ పరిశోధనలు, సమాజానికి దిక్సూచిలా ముందుకు నడపాలని అన్నారు. ప్రతి అధ్యాపకుడు తనతోపాటు, పరిశోధక విద్యార్థులు మరియు పీజీ విద్యార్థులను సైతం పరిశోధనల వైపు ప్రోత్సహించాలని అన్నారు. ఉన్నత ప్రమాణాల జర్నలలో ప్రచురించిన పరిశోధకులకు ప్రోత్సాహకాలు సైతం ఈ ఏడాది నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నాక్ మూడో విడత మూల్యాంకనం 2028లో జరగనున్న దృష్ట్యా విశ్వవిద్యాలయం గత పనితీరు, రాబోవు రోజుల్లో వివిధ విభాగాల చొరవ, వారి భాగస్వామ్యం పై చర్చించారు. ఈ విడత నాక్ ఏ గ్రేడ్ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
అనంతరం ఆచార్య గోపికృష్ణ మాట్లాడుతూ నాక్ ఎప్పుడు ఆవిష్కరణలు మరియు ఉన్నత ప్రమాణాలపై సానుకూలత దృష్ట్యా ప్రతి విభాగం తమ పరిధిలో ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలని, పర్యావరణహితమైన పద్ధతులపై మోగ్గు చూపాలని తెలిపారు.
అనంతరం గోనా రెడ్డి మాట్లాడుతూ రాబోవు రోజుల్లో రెండు జాతీయ సెమినార్ల ను ఎంజీయూలో నిర్వహించనున్నట్లు , అదేవిధంగా సామాజిక స్పృహ కలిగి అధ్యాపకులు సామాజిక వేదికలు నిర్వహించే చర్చల్లో, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలను ఎల్లవేళలా అందించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ఐక్యసి డైరెక్టర్ డా మిరియాల రమేష్, డీన్లు ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య రేఖ, ఆచార్య అన్నపూర్ణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, ప్రిన్సిపాల్ డా సుధారాణి, డా శ్రీదేవి, డా అరుణప్రియ తదితర అధికారులు పాల్గొన్నారు.