Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Lok sabha elections: ఎన్నికల సమయంలో రోజుకు రూ.100కోట్ల సీజ్

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం కోసం రాజకీయ పార్టీలు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటాయి. వాటిని అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తూ ఉంటుంది.

ఇప్పటికే రూ. 4,650 కోట్లు పట్టివేత
కట్టుదిట్ట ఆదేశాలతో నిబంధనలు అమలు

ప్రజాదీవెన, ఢిల్లీ: ఎన్నికల సమయంలో(Lok sabha elections) ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం కోసం రాజకీయ పార్టీలు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటాయి. వాటిని అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తూ ఉంటుంది. ఓటర్లకు నేరుగా నగదు పంపిణీ నుంచి మొదలుపెట్టి మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, ఖరీదైన బహుమతుల రూపంలో ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది. దీన్ని అరికట్టేందుకు ఈసీ ప్రతి రాష్ట్రంలో జనరల్ అబ్జర్వర్లతో పాటు పోలీస్ అబ్జర్వర్లను పెట్టి, ప్రభుత్వ యంత్రాంగంతో ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిరోజూ దేశంలో అనేక ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నగదు, మద్యం, మాదక ద్రవ్యాల రూపంలో రికవరీ జరుగుతోంది.

మార్చి 1 నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే మొత్తం రూ. 4,650 కోట్ల విలువైన రికవరీ చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అంటే సగటున రోజుకు రూ. 100 కోట్ల మేర రికవరీ జరుగుతోంది. పార్లమెంట్‌కు జరిగిన మొట్టమొదటి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని అన్నికల్లో ఇది అత్యధిక మొత్తంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇందులో నగదు రూపంలో రూ. 395.39 కోట్లు స్వాధీనం చేసుకోగా, బంగారం – ఇతర విలువైన లోహాల రూపంలో రూ. 562.10 కోట్లు రికవరీ చేసినట్టు ఈసీ వెల్లడించింది. అలాగే మద్యం రూపంలో రూ. 489.31 కోట్లు విలువచేసే 3.58 కోట్ల లీటర్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. గంజాయి నుంచి మొదలుపెట్టి కొకైన్ వరకు వివిధ రూపాల్లో ఉన్న మాదకద్రవ్యాలను కూడా ఈసీ అధికారులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం జరిగిన రికవరీల్లో రూ. 2,068.85 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అంటే.. రికవరీల్లో సింహభాగం (45% ) వాటా మాదకద్రవ్యాలదే అని అర్థమవుతోంది. ఇక టీవీలు, ఫ్రిడ్జిలు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, బహుమతుల రూపంలో రూ. 1,142.49 కోట్ల మేర స్వాధీనం చేసుకున్నామని వివరించింది.

గత సార్వత్రిక ఎన్నికల్లో(Lok sabha elections) (2019) మొత్తం కలిపి ఈసీ స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 3,475 కాగా, ఆ రికార్డును ఈసీ ఇప్పటికే అధిగమించి దూసుకెళ్తోంది. జూన్ 1తో ముగియనున్న 7 విడతల ఎన్నికల నాటికి ఈసీ ఇంకా ఎంత మొత్తంలో రికవరీ చేసుకుంటుంది అన్నది ఊహకే అందడం లేదు. సమగ్ర ప్రణాళిక, సంయుక్త కార్యాచరణ, దర్యాప్తు సంస్థలు, భద్రతా బలగాల మధ్య సమన్వయంతో పాటు పౌరుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోగల్గుతున్నామని ఈసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వేటే..
ఎన్నికలను డబ్బుతో ప్రభావితం చేయడం ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థులకు సమాన అవకాశాలు లేకుండా పోతాయని ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యర్థులకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండేలా చూడడం కోసం ఈసీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చింది. ఎన్నికల అవకతవకలపై గతంలో ఎదురైన అనుభవాలు, ఇప్పుడు అనుసరిస్తున్న ఆధునిక విధానాలను అధ్యయనం చేసి తాము చర్యలు తీసుకుంటున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఫేజ్-1 ఎన్నికల కోసం నియమించిన కేంద్ర పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్, మరో ఇద్దరు కమిషనర్లు నిర్వహించిన సమీక్షా సమావేశంలో అనేకాంశాలపై లోతుగా చర్చించారు.

ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహించడానికే తాము అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, ఈ క్రమంలో కఠినంగా తనిఖీలు జరుగుతున్నాయని వెల్లడించారు. విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు సహా ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోడానికి ఈసీ ఏమాత్రం వెనుకాడడం లేదు. తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో ఓ ప్రముఖ నేత కాన్వాయ్‌ను తనిఖీ చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించినందుకు ఫ్లైయింగ్ స్క్వాడ్‌పై ఈసీ వేటు వేసింది.

ఒక రాష్ట్రంలో సీఎం కాన్వాయ్, మరో రాష్ట్రంలో డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ను తనిఖీ చేయకుండా వదిలేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. అంతేకాదు, ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. అలా ఇప్పటి వరకు 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసినట్టు వెల్లడించింది.

More money seized in Parliament elections