విడాకులు తీసుకున్న నిహారిక కొణిదల
ప్రజా దీవెన/హైదారాబాద్:ప్రముఖ నటుడు, నిర్మాత కొణిదెల నాగబాబు కూతురు నటి, నిర్మాత నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ లు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు.ఈ మేరకు వారిద్దరూ విడాకులకు ముందుకెల్లారు.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకోగా కోర్టు విడాకులను మంజూరు చేసింది.
వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, విడిపోయేందుకు సిద్ధపడ్డారని అప్పట్లో సినీ వర్గాల్లో ప్రచారం సాగడంతో పాటు తాము కలిసి దిగిన ఫొటోలను ఇరువురు సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించడంతో ఆ వార్తలకు బలం చేకూరింది.
అదే సమయంలో మెగా కుటుంబంలో జరిగిన వేడుకలన్నింటికీ నిహారిక మాత్రమే హాజరుకావడం చర్చకు దారి తీసింది.
నటుడు, నిర్మాత నాగబాబు తనయ అయిన నిహారిక, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డకు 2020 ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. 2020 డిసెంబరులో జరిగిన వీరి పెళ్లికి రాజస్థాన్ ఉదయపూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్ వేదికైంది. వివాహానంతరం సినిమాలకు దూరమైన నిహారిక ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్‌సిరీస్‌తో ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చారు.