Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Illegal liquor: బెల్ట్’ ఆగదా..?

లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే..

కోడ్ ఉన్నా ఆగని అక్రమ మద్యం దందా
పట్టని అబ్కారీ శాఖ, పోలీసులు
ఆటో బైకుల ద్వారా లిక్కర్ సరఫరా
గ్రామాల్లో, పట్టణాల్లో తాగి ఊగేస్తున్నారు
24గంటలూ మద్యం అమ్మకాలు..?

ప్రజాదీవెన,: లోక్‌ సభ ఎన్నికల(Lok sabha elections) నేపథ్యంలో దేశవ్యాప్తంగా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.. కానీ, తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న వైన్స్‌ షాపుల నుండి పట్టణంలోని బెల్ట్‌ షాపులకు ఆటో, బైకుల ద్వారా యధేచ్చగా మద్యం సరఫరా చేస్తూ ప్రతి గల్లీల్లో కూడా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు.

అన్ని విషయాల్లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (Model Code of Conduct) ను అమలు చేస్తున్న అధికారులు మద్యం విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ లోపాయి కారంగా బెల్ట్ షాపు యాజమాన్యానికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరంతరం నిఘా ఉన్నప్పటికీ ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖల అధికారులు ఎన్నికల డ్యూటీలో గస్తీ కాస్తున్నా ఇంత ఈజీగా బెల్ట్‌ షాపులకు మద్యం సరఫరా ఎలా అవుతుందని..? నగరంలో బెల్ట్‌ షాపుల ద్వారా మద్యం విక్రయాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ చార్మినార్, చత్రినాక, బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా ప్రాంతాల్లో దాదాపు ప్రతి కిరాణా షాపు, కూల్ డ్రింక్ షాపులు ఒక బెల్ట్‌ షాపుగా మారి ఎమ్మార్పీ ధరలకు మార్కెట్లో దొరకాల్సిన మద్యాన్ని రూ.20నుండి రూ. 50 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఎవరూ నోరు మెదపకుండా చోద్యం చూస్తూ ఉండిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి అడపాదడపా ఒకటి రెండు కేసులు నమోదు చేస్తున్నారు.

కానీ అందరికీ తెలిసే అధికారికంగా బెల్ట్‌ దందా(Wine shop) జోరుగా నడుస్తుందని మద్యం ప్రియులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఎక్సైజ్‌ శాఖ పరిధిలో రాష్ట్రంలో అన్ని బెల్ట్‌ షాపుల దందా జోరుగా సాగుతుంది. బెల్ట్స్‌ షాపుల దందాను అరికట్టాల్సిన ఎక్సైజ్‌ పోలీసులు, పోలీసులు బెల్ట్ షాపు యాజమాన్యం ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నికల కోడ్‌ పుణ్యమా అని బెల్ట్‌ దందా లాభసాటిగా ఉండడంతో గతంలో కేవలం కిరాణా షాపులు మాత్రమే నిర్వహించేవారు కూడా నిబంధనలకు విరుద్ధంగా వార్డులలోని కిరాణా షాపుల్లో శీతల పానీయాలకు తోడుగా కొత్తగా బెల్ట్‌ దందా షురూ చేయడం గమనార్హం. ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్ట్‌ షాపుల్లో బ్రాండెడ్‌ మద్యం తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు ఎంతైనా దొరుకుతుందని పేర్కొంటున్నారు.

దీంతో యువత మద్యానికి బానిసలుగా మారి తాగిన మైకంలో గొడవలకు దీగుతున్నారని.. బెల్టు దుకాణాల మధ్య ఉన్న ఇండ్ల యజమానులు ఆరోపిస్తున్నారు. ఇలా నగరంలోని బెల్ట్‌ షాపుల దందా విచ్చలవిడిగా కొనసాగుతున్న చర్యలు మాత్రం సున్నాఅని అంటున్నారు.మరోవైపు ఇళ్ల మధ్యలోనే బెల్ట్‌ దందా కొనసాగడంతో మహిళలు అభ్యంతరాలు వృక్తం చేసినా పట్టించుకోకపోవడంతో అధికారుల అండదండలతో కొనసాగుతున్నాయనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట.

దీనితో అసలు ఇక్కడ ఎన్నికల కోడ్‌( Election code) అమలులో ఉందా లేదా అనేది అర్దం కావడం లేదని సామాన్యులు సైతం వాపోతు న్నారు. అదే అదునుగా భావించిన రాజకీయ నాయకులు మద్యం మత్తులో ప్రజలను మభ్యపెట్టి ఓట్లకు గాలం వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సజావుగా జరగాలంటే బెల్ట్‌ షాపుల ద్వారా మద్యం అమ్మకాలను కట్టడి చేయాలని కోరుతున్నారు.

Illegal liquor supply in Election code