Graduate MLC Elections: నేడు ‘ పట్టభద్రుల ‘ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వ హణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
ఈ నెల 27న పోలింగు
జూన్ 5 న ఓట్ల లెక్కింపు
రేపు నామినేషన్ వేయనున్న తీన్మార్ మల్లన్న
4,61,806 మంది ఓటర్లు
ఎన్నికల అధికారిగా నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన
నామినేషన్ల స్వీకరణకు ములుగు అదనపు కలెక్టర్ మహేందర్ జీ కి బాధ్యతలు
ప్రజా దీవెన నల్లగొండ బ్యూరో: తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక(Graduate MLC Elections notification) నిర్వ హణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. శాసనమండలిలో వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల నియోజక వర్గ ఉప ఎన్నిక కోసం గురువారం నుంచి ఈ నెల 9 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 13వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది.
ఈ నెల 27న పోలింగు నిర్వహించి జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నియోజక వర్గం నుంచి గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి గతేడాది జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు.
ఈ ఉప ఎన్నికకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు నల్గొండ జిల్లా కలెక్టర్ కు నామినే షన్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కాగా 13వ తేదీన లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణకు ములుగు జిల్లా అదనపు కలెక్టర్ సిహెచ్. మహేందర్ జీ (రెవెన్యూ) ను నియమించారు. నల్లగొండ కలెక్టర్ అందుబాటులో లేని సమయం లో ఆయన అభ్యర్థుల నుంచి నామినేషన్లు(Nominations) స్వీకరించనున్నారు.
పల్లా రాజీనామాతో ఉప ఎన్నిక..
2021లో జరిగిన ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన గత నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండడంతో అందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. గురువారం నోటిఫికేషన్ విడుదలచేసి ఈనెల తొమ్మిది వరకు నామినేషన్లను స్వీకరించినన్నారు. 10న నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తారు. 13వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు. అదే రోజు బరిలో ఉన్న అబ్యర్థులను ప్రక టిస్తారు. 27వ తేదీన పోలింగ్ జరగనుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి..
పట్టభద్రుల ఎమ్మెల్సీకి(Graduate MLC Elections ) సంబంధించిన నామినేషన్ల స్వీకరణకు నల్లగొండ కలెక్టరేట్ లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నామినే షన్ పత్రాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో 4,61,806 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 12 కొత్త జిల్లాల పరిధిలో 600 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 9న తుది జాబితా ప్రకటించనున్నారు.
నామినేషన్ వేయనున్న మల్లన్న….
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా తీన్మార్ మల్లన్న శుక్రవారం నామినేషన్ వేనున్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయనజిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో విద్యార్థులతో చర్చించారు. వివిధ విద్యార్థి కుల సంఘాల నాయకులతో కలిసి ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. నల్గొండ జిల్లా నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీమంత్రి జానారెడ్డి, సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి సహకారం తనకు ఉందని నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డి సహకారం కూడా ఉందని తన విజయం తద్యమని తనకు ప్రత్యర్ధులు కూడా లేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం భారీ ర్యాలీతో నామినేషన్ వేయబోతున్నానని అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలపాలని కోరారు.
Graduate MLC Elections notification