Elections: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ సిబ్బంది కృషి చేయాలి
ఈనెల 13న (రేపు) లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతమైన వాతావరణంలో జరుగుటకు ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా యస్పి చందనా దీప్తి తెలిపారు.
విధులు నిర్వర్తించే సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి
పోలింగ్ కేంద్రాల వద్ద జాగ్రత్తగా తనిఖీ చేయాలి
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పై ప్రత్యేక దృష్టి సారించాలి
జిల్లా ఎస్పి చందనా దీప్తి
ప్రజా దీవెన నల్గొండ: ఈనెల 13న (రేపు) లోక్ సభ ఎన్నికలు(Lok sabha elections) జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతమైన వాతావరణంలో జరుగుటకు ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా యస్పి చందనా దీప్తి తెలిపారు. నల్లగొండ(Nalgonda) పట్టణ కేంద్రంలోని యన్.జి కళాశాల ఈ వి యం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నందు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పార మిలటరీ బలగాలకు అవగాహన కార్యక్రమం ( బ్రీఫింగ్ సెషన్ ) ను నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… జిల్లాలో ఎన్నికలు ప్రశాంతం వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుటకు ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న ఎన్నికల సిబ్బందికి సమన్వయంతో జిల్లా పోలీస్ సిబ్బంది పనిచేయాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఉండేలా సంబంధిత అధికారులతో మాట్లాడి సరిచూసుకోవాలని, ఓటర్లు క్యూలైన్లు పాటించే విధంగా, పోలింగ్ కేంద్రాల్లోకి ఎలాంటి మండే పదార్థాలు ఇతర రసాయనాలు తీసుకెళ్ళకుండ జాగ్రత్తగా తనిఖీ చేయాలని, 100 మీటర్ల పరిధిలోకి ఎవ్వరూ రాకుండా చూడాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహించాలని ఆదేశించారు.
చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహించే వారు, ప్రధానంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గల గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని,పలు జాగ్రత్తలు సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టే డబ్బు,మద్యం పైన నిఘా పెట్టాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని,ఎవరైనా ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడినట్లయితే తక్షణమే సంబంధిత పై అధికారులకు తెలపాలని అన్నారు. ఓటర్లకు భరోసా కలిగించే విధంగా ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలని పోలీస్ అధికారులకు, సిబ్బందికి తెలిపారు.
సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే ఎన్నికల బందోబస్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. డిస్ట్రిబ్యుషన్ సెంటర్(Distribution Center) నుండి పోలింగ్(Polling centers) కేంద్రాలకు ఈవీఎంలను(Evms) తరలించి, పోలింగ్ పూర్తయ్యాక సాయంత్రం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించే వరకు జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రాలను వదిలి వెళ్లరాదని. సూచించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని, పోలింగ్ రోజున ఏవైనా సంఘటనలు జరిగితే వెంటనే పోలింగ్ అధికారికి తెలియజేయాలని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అందరూ కృషి చేయాలని సూచించారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
(జిల్లా యస్పి చందనా దీప్తి)
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకావాలని అన్నారు. శాంతి భద్రతల కి విఘాతం కలిగించే వారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులు, గుంపులుగా 5 గురు కంటే ఎక్కువ తిరగరాదని అన్నారు.ఓటర్లను ప్రలోబ పెట్టే డబ్బు,మద్యం ఇతర సంబంధిత వస్తువులు ఎవరైనా పంచితే వెంటనే సి.విజిల్ యాప్ లో అప్ లోడ్ చేయుట కానీ, డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.
Elections conducted in peaceful atmosphere