సిఎం కెసిఆర్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
అధికారులతో కలిసి మంత్రి జగదీష్ సమీక్ష
ప్రజా దీవెన/సూర్యాపేట: సూర్యాపేట సమీకృత కలెక్టర్ భవన సముదాయం ప్రారంభానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన ఏర్పాట్ల ను మంత్రి జగదీష్ అధికారులతో కలిసి సమీక్షించారు.ఈ నెల 24 న సిఎం చేతుల మీదుగా ప్రారంభం కానున్న నూతన కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాలను పరిశీలించి సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.అధికారులతో కలిసి రూట్ మ్యాప్ లు సభా స్థలి వేదికలను పరిశీలించారు మంత్రి జగదీష్ రెడ్డి. తొలుత నూతన కలెక్టరేట్ ఎదురుగా గల ప్రాంతాన్ని సభా స్థలం కొరకు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తో కలిసి పరిశీలించారు. అనంతరం నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అక్కడినుండి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను పరిశీలించి ప్రారంభానికి తగు ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులకు తెలిపారు.
- మార్కెట్ యార్డ్ పక్కన గల స్థలాన్ని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం డిపివో కార్యాలయాన్ని పరిశీలించి సీఎం పర్యటన మ్యాపులు రూట్లను అధికారులతో కలిసి చర్చించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, DSP లు, CI లు పోలీస్ హౌసింగ్ బోర్డు CE తులసిధర, EE అబ్దుల్ ఖుద్దుఫ్ హుస్సేన్, DE సుందర్, AE బాలరాజు,తాసిల్దార్ వెంకన్న జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.