Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Again a special darshan quota in Tirumala తిరుమలలో మళ్ళీ ప్రత్యేక దర్శన కోటా

వేసవి రద్దీతో తగ్గిన కోటా వచ్చే నెల నుంచే

 

తిరుమలలో మళ్ళీ ప్రత్యేక దర్శన కోటా

వేసవి రద్దీతో తగ్గిన కోటా వచ్చే నెల నుంచే

ప్రజా దీవెన /తిరుమల: తిరుమల తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా పునరుద్ధరించేందుకు టీటీడీ నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు రూ. 300 దర్శన టికెట్ల కోటా పైన టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేసారు. వేసవి రద్దీ కారణంగా తగ్గించిన రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా తిరిగి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విడుదల చేస్తామని ప్రకటించారు.శ్రీవారి ఆలయంలో తోపులాట లేకుండా మహాద్వారం నుంచి బంగారు వాకిలి వరకు సింగిల్ లైన్ లో భక్తులను అనుమతిస్తున్నామని ధర్మారెడ్డి వెల్లడించారు.

శ్రీవాణి ట్రస్టు పైన వస్తున్న ఆరోపణల పైన ఈవో స్పందించారు. ఈ క్రమంలో ఆయన టీటీడీ ఈవో ధర్మారెడ్డి పలు కీలక అంశాల పైన స్పష్టత ఇచ్చారు. డయల్ యువర్ ఈవో లో భాగంగా ధర్మారెడ్డి త్వరలోనే తగ్గించిన రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్ లైన్ కోట విడుదల చేస్తామని ప్రకటించారు. శ్రీవాణి ట్రస్ట్ కి ఇప్పటి వరకు రూ. 880 కోట్లు విరాళాలు అందాయని ధర్మారెడ్డి చెప్పారు.

ట్రస్టు పైన చేస్తున్న రాజకీయ ఆరోపణలను ఖండించారు.శ్రీవాణి ట్రస్తుకు విరాళాలు ఇచ్చి ఇప్పటి వరకు తొమ్మిది లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని వివరించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో 2500 ఆలయాల నిర్మాణం జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు ఈ ట్రస్టుకు సంబంధించి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని ఈవో స్పష్టం చేసారు.

ట్రస్ట్ ఆలయ నిర్మాణాలు కోంత మంది కాంట్రాక్టర్లకు మాత్రమే ఇస్తూన్నామని అసంబద్దమైన ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఆలయ నిర్మాణాలు నాలుగు విధానాలలో నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. దేవాదాయ శాఖ, టీటీడీ, ఆలయ కమిటీలు, స్వచ్చంద సంస్థ ద్వారానే నిర్మాణాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

పార్వేటి మండపం శిధిలావస్థకు చేరుకోవడంతోనే జీర్ణోద్దారణ చేస్తున్నామని వెల్లడించారు.పార్వేట మండపాన్ని కూల్చేసామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వసతి, సముదాయాల డిపాజిట్లు ఏడు రోజుల్లోనే భక్తుల ఖాతాల్లో జమ అవుతాయని ఈవో స్పష్టం చేసారు. రా్రి వేళ గాలి గోపురం నుంచి వచ్చే వారు గోవింద నామస్మరణతో గుంపుగా రావాలని ఈవో సూచించారు.

జూన్  నెలలో శ్రీవారిని 23 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. హుండీ ద్వారా రూ 116.14 కోట్లు ఆదాయ వచ్చినట్లు టీటీడీ తెలిపింది. 1.6 కోట్ల లడ్డులను భక్తులకు విక్రయించినట్లు ధర్మారెడ్డి వివరించారు.10.80 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 23.48 లక్షల మంది అన్న ప్రసాదం స్వీకరించారని ధర్మారెడ్డి వివరించారు.

ఘాట్ రోడ్డులో ప్లాస్టిక్ వ్యర్ధాల కారణంగా వన్యప్రాణులకు హాని కలుగుతోందన్నారు. దీని కారణంగా వ్యర్థాలు వేసేందుకు ఆర్టీసీ బస్సుల్లోనే చెత్త కుండీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.