Praja Deveena
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 4:14 pm Posted by : prajadeveena.com

Victoris Hits 1 Lakh Sales : విక్టోరిస్ జోరు.. 8 నెలల్లో లక్ష అమ్మకాలు

Victoris Hits 1 Lakh Sales : మారుతీ సుజుకీ విక్టోరిస్ (Maruti Suzuki Victoris)భారత మార్కెట్లో అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. 2025 సెప్టెంబర్‌(September)లో విడుదలైన ఈ ఎస్‌యూవీ (SUV) కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే లక్ష యూనిట్ల విక్రయాలను దాటడం ద్వారా కొత్త రికార్డు సృష్టించింది. దీంతో మారుతీ సుజుకీ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఎస్‌యూవీగా విక్టోరిస్ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

మార్కెట్లోకి వచ్చిన తొలి ఐదు నెలల్లోనే 50 వేల యూనిట్ల అమ్మకాలు నమోదు చేసిన విక్టోరిస్, 2026 జనవరి(January)లో అత్యధికంగా 15,240 యూనిట్ల విక్రయాలతో మరో రికార్డు నెలకొల్పింది. ఆ నెలలో కంపెనీ విక్రయించిన మొత్తం యుటిలిటీ వాహనాల్లో దాదాపు ఐదో వంతు వాటాను ఈ మోడల్ ఒంటరిగానే సాధించడం విశేషం.

అమ్మకాల పరంగా ఎర్టిగా, బ్రెజ్జా తర్వాత కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా విక్రయమైన యుటిలిటీ వాహనాల్లో విక్టోరిస్ మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు నెలల్లో కూడా ఫ్రాంక్స్, ఎర్టిగా, బ్రెజ్జా తర్వాత అత్యధిక డిమాండ్ ఉన్న మోడల్‌గా కొనసాగుతోంది.

Maruti Suzuki Victoris SUV achieving 1 lakh sales milestone in India within eight months of launch

అంతేకాకుండా, గ్రాండ్ విటారా లక్ష అమ్మకాల మార్కును చేరుకోవడానికి దాదాపు ఏడాది సమయం తీసుకోగా, విక్టోరిస్ అదే లక్ష్యాన్ని ఎనిమిది నెలల్లోనే సాధించింది. దీంతో కంపెనీకి కొత్త స్టార్ మోడల్‌గా మారింది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఇదే జోరు కొనసాగితే త్వరలోనే 1.5 లక్షల యూనిట్ల విక్రయాలను కూడా దాటే అవకాశం ఉంది.

విక్టోరిస్‌లో వినియోగదారులకు మూడు రకాల ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, అలాగే సీఎన్జీ వేరియంట్‌ను కంపెనీ అందిస్తోంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ లీటరుకు 28.56 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుండగా, సీఎన్జీ మోడల్ కిలో సీఎన్జీకి 27.02 కిలోమీటర్ల సామర్థ్యాన్ని అందిస్తుంది.

భద్రత పరంగా కూడా ఈ ఎస్‌యూవీ మంచి మార్కులు సాధించింది. భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ పొందడం ద్వారా సురక్షితమైన కార్ల జాబితాలో చోటు సంపాదించింది. ప్రస్తుతం విక్టోరిస్ ధరలు రూ.10.77 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌కు రూ.19.72 లక్షల వరకు ఉన్నాయి.

ఇక కొనుగోలుదారులకు కంపెనీ జూన్ నెలలో ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించింది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లపై ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ డిస్కౌంట్లతో కలిపి రూ.90,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. సీఎన్జీ వేరియంట్లపై రూ.80,000 వరకు, పెట్రోల్ మోడళ్లపై రూ.60,000 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.