ఆర్టీసీ బస్సు చక్రాల కింద బిచ్చగత్తె బతుకు
ప్రజా దీవెన/ నాగర్ కర్నూలు: ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పట్టణంలోని యాచకురాలు ఆర్టీసీ బస్సు కింద నలిగి దుర్మరణం చెందింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల అందించిన వివరాల మేరకు నాగర్ కర్నూల్ మండలం వనపట్ల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ బి (55) నాగర్ కర్నూల్ పట్టణంలో యాచకురాలుగా జీవనం సాగిస్తోంది. గురువారం కోర్టు ముందు నుంచి అటువైపు పాకుతూ వెళుతుండగా నాగర్ కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బస్టాండ్ లోకి వెళ్తున్న క్రమంలో డ్రైవర్ గమనించలేదు. దీంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.