Attack on CM Jagan: సీఎం దాడి ఘటనపై ఈసీ ఆరా..!
సీఎం జగన్ పై రాయి దాడి ఘటనకు సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం ఆరా తీసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
రాజకీయ హింస పెరగకుండా చూడాలి
పూర్తి వివరాలు ఇవ్వాలన ప్రభుత్వాన్ని ఆదేశ్
ప్రజాదీవెన, విజయవాడ: సీఎం జగన్ పై రాయి దాడి ఘటనకు సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం ఆరా తీసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. వీఐపీల భద్రతలో వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ హింస పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇటీవల చిలకలూరిపేటలోని ప్రధాని సభ, ఇప్పుడు సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు సంధించింది. అప్పుడు ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన సీఈసీ.. ఇప్పటికే ఐజీ, ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. తాజాగా, సీఎం జగన్ రోడ్ షోలో జరిగిన ఘటనపైనా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
6 బృందాలతో దర్యాప్తు
మరోవైపు, సీఎం జగన్ పై దాడి (jagan attack) ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడి ఘటనపై అజిత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ స్థాయి అధికారులతో 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు కాగా.. నిందితుల కోసం గాలింపు తీవ్రం చేశారు. ప్లాన్ ప్రకారమే దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు.. సీసీ ఫుటేజీ, డ్రోన్ విజువల్స్ ను జల్లెడ పడుతున్నారు. అటు, వెల్లంపల్లి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డు చేశారు. సీఎం జగన్ పై దాడి ఘటనను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
ఇదీ జరిగింది
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం సీఎం జగన్ విజయవాడ చేరుకున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ రాత్రి 8:10 గంటలకు సింగ్ నగర్ డాబాకొట్ల వద్దకు చేరుకోగానే రాయి దాడి జరిగింది. అయితే, ఆ సమయంలో ఆయన పక్కకు జరగడంతో ఎడమ కంటి కనుబొమ్మపై బలమైన గాయమైంది. అనంతరం పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లికి సైతం రాయి తగలడంతో గాయమైంది. ఘటన జరిగిన వెంటనే బస్సులోకి వెళ్లిన సీఎం జగన్ కు ప్రాథమిక చికిత్స అందించారు. స్థానికంగా ఓ స్కూల్ భవనం, గంగానమ్మ గుడికి మధ్యలో చెట్ల దగ్గర నుంచి దాడి జరిపినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు.
కుడివైపు జనావాసాలు ఉండడంతో ఎడమవైపు స్కూల్, గంగానమ్మ గుడి మధ్య ప్రాంతాన్ని నిందితుడు ఎంచుకున్నట్లు గుర్తించారు. పూర్తిగా చీకటి, చెట్లు ఉండడంతో ఎవరికీ కనిపించకుండా.. దాడికి పాల్పడిన తర్వాత సులభంగా తప్పించుకోవచ్చని నిందితుడు ఆ ప్రాంతాన్ని దాడికి ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దాదాపు 30 అడుగుల దూరం నుంచి రాయిని బలంగా విసిరినట్లు తెలుస్తోంది. బస్సు యాత్ర విజయవాడలోకి శనివారం సాయంత్రం ప్రవేశించగానే.. రాత్రి యాత్ర సాగే మార్గంలో విద్యుత్ సరఫరా నిలిపేస్తుండడాన్ని ఆగంతుకుడు ఆసరాగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
EC inquired about CM Jagan attack incident