Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

గ్రూప్ 4ఫలితాల వెల్లడికి కసరత్తు

ఎన్నికల షెడ్యూల్ లోపే ఫలితాల విడుదల

గ్రూప్ 4ఫలితాల వెల్లడికి కసరత్తు

— ఎన్నికల షెడ్యూల్ లోపే ఫలితాల విడుదల

ప్రజా దీవెన/ హైదరాబాద్: శాసన సభ ఎన్నికల షెడ్యూల్‌ జారీ అయ్యే  నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వo భావిస్తోంది. త్వరలోనే గ్రూప్‌4 పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తులు ప్రారంబించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 వేలకు పైగా ఉన్న గ్రూప్‌4 పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో సానుకూల వైఖరి ఏర్పడటానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో అతిత్వరలో గ్రూప్‌4 ఫలితాలను వెల్లడించాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 8,180 గ్రూప్‌4 పోస్టుల భర్తీ కోసం ఈ నెల 1న పరీక్ష నిర్వహించారు. ఈ ఉద్యోగాల కోసం 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, దాదాపు 80% మంది పరీక్ష రాశారు. ఫలితాల విడుదలలో భాగంగా ఆయా అభ్యర్థులు సాధించే మార్కులను ప్రకటించనున్నారు.

ఈ మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్ల వారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రస్తుత నోటిఫికేషన్‌లో సుమారు 99 శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఇందులో జిల్లా, జోనల్‌ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో ఏ పోస్టుకు ఏ అభ్యర్థి పోటీ పడుతున్నారనే విషయాన్ని వెబ్‌ ఆప్షన్ల ద్వారా నిర్ధారించనున్నారు.

ఫలితాలు వెల్లడించిన తర్వాత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. అనంతరం ఆయా పోస్టులకు పోటీ పడే అభ్యర్థులను మెరిట్‌ ప్రకారం ఎంపిక చేయనున్నారు. తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తిచేసి, తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ ముగియడానికి ఫలితాల ప్రకటన తర్వాత నెల నుంచి 2 నెలల సమయం పట్టే అవకాశముంది.

ఎన్నికల షెడ్యూల్‌ నవంబరు లేదా డిసెంబరులో విడుదలయ్యే చాన్స్‌ ఉందని అంచనా వేస్తున్నారు. ఆ లోపు గ్రూప్‌4 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.