ప్రజా దీవెన, హైదరాబాద్: ఆధార్ విషయంలో ఆడవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలోని పౌరు లందరికి విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించడం మొదలై దాదాపు పదిహేనేళ్లవుతోంది. ఈ క్రమంలో ఆధార్ కార్డుల్ని జారీ చేసిన తర్వాత ఇప్పటి వరకు వాటిలో తప్పొప్పుల్ని సవరించుకోని వారు, ఆధార్‌లో వివరాలను అప్డేట్ చేసుకోని వారు కూడా దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఆధార్ కార్డు జారీ చేసే సమయంలో ప్రాథమికంగా ఉన్న సమాచారం ఆధారంగా అందులో వివరాలను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పెళ్లైన మహిళలు, గృహిణులు తమ భర్తల ఇంటిపేర్లతో ఆధార్ కార్డుల్లో నమోదు చేసుకున్నారు. అలాంటి వారందరికి ఇప్పుడు చిక్కులు తప్పడం లేదు.
ఆధార్ విశిష్ట సంఖ్య ఇప్పుడు దేశంలో అన్నింటికి ఆధారమై పోయింది. పుట్టినప్పటి నుంచి చివరి మజిలీ వరకు అన్ని వివరాలు ఆధార్‌తో ముడిపెట్టేశారు. ఈ క్రమంలో చదువుకుని ఉద్యోగాలు చేసే మహిళలకు చిక్కులు తప్పడం ఆధార్ కార్డుల జారీ చేసే సమయంలో నమోదు చేసిన వివరాలకు, వారి సర్టిఫికెట్లలో ఉన్న పేర్లకు మార్పులు ఉంటే వాటిని సవరించుకోవడానికి తిప్పలు తప్పడం లేదు. పుష్కరం క్రితం ఆధార్ కార్డులను జారీ చేసే సమయంలో మహిళల వివరాలను నమోదు చేసేటపుడు కుటుంబ వివరాల ఆధారంగా ఆధార్ కార్డులో పేర్లను నమోదు చేశారు. ఇందుకు రేషన్ కార్డు, ఓటరు కార్డు వంటి వాటిని ప్రామాణికంగా తీసుకున్నారు. ఆ సమయంలో చదువుకున్న మహిళలకు ఏ పేరును కొనసాగించాలనే దానిపై స్పష్టత కొరవడింది. దీంతో పెద్ద సంఖ్యలో మహిళలు భర్త ఇంటి పేరును ఆధార్ కార్డుల్లో నమోదు చేసుకున్నారు.