Investment:తల్లిదండ్రులు పిల్లల (Children) భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం. పిల్లలకు మంచి జీవన ప్రమాణాలు, ఉన్నత విలువలు, నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఉన్నత విద్య ఖరీదైనది. పిల్లలను విదేశాలకు చదువుకోసం పంపాలనుకుంటే, మీకు మరింత డబ్బు అవసరమవుతుంది. అందుకే పిల్లలు పుట్టినప్పటి నుంచే పెట్టుబడి (Investment) ప్రారంభించడం మంచిది. పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడానికి మీరు ఏం చేస్తున్నారు? వారి విద్య, పెళ్లి వంటి ఖర్చుల కోసం డబ్బు సేకరించడానికి ఒక మంచి మార్గం మ్యూచువల్ ఫండ్ SIP.
SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇది ఒక నిర్ణీత మొత్తంలో డబ్బును క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టే పథకం. ఉదాహరణకు, ప్రతి నెలా రూ.5,000 లేదా రూ.10,000 SIP ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. స్టెప్-అప్ SIPలో ఏటా SIP మొత్తాన్ని కొంత శాతం పెంచుతారు. ఉదాహరణకు, ప్రతి నెలా రూ.5,000తో ప్రారంభించి, ఏటా 5% పెంచుకోవచ్చు. అంటే, రెండవ సంవత్సరంలో రూ.5,250, మూడవ సంవత్సరంలో రూ.5,512.50, ఇలా పెంచుతూ పోతారు. పిల్లల భవిష్యత్తు కోసం రూ.5,000 స్టెప్-అప్ SIP ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఏటా 5% పెంచుతారు. 12% వార్షిక రాబడిని పొందితే, 18 ఏళ్ల తర్వాత మీ పెట్టుబడి విలువ రూ.51,45,394కు చేరుకుంటుంది.
ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి పెట్టే స్తోమత ఉంటే, మీ పిల్లల భవిష్యత్తు కోసం మరింత ఎక్కువ సంపదను సృష్టించవచ్చు. పుట్టినప్పటి నుండి మీ పిల్లల కోసం నెలకు రూ.10,000 రెగ్యులర్ SIP ప్రారంభిస్తే, 18 ఏళ్ల తర్వాత మీరు రూ.76,54,392 పొందవచ్చు (12% వార్షిక రాబడి అంచనా).
స్టెప్-అప్ SIP: ప్రతి నెలా రూ.10,000 SIP ప్రారంభించి, ప్రతి సంవత్సరం 5% పెంచుకుంటే, 18 సంవత్సరాల తర్వాత మీరు రూ.1,02,90,788 పొందవచ్చు (12% వార్షిక రాబడి అంచనా). అంటే, ప్రతి నెలా కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టి, మీ పెట్టుబడిని పెంచుకుంటూ పోతే, దాదాపు రూ.25 లక్షలకు పైగా ఎక్కువ సంపాదించవచ్చు.