UPI Lite: భారతదేశంలో యూపీఐ పేమెంట్స్ (UPI Payments) బాగా పాపులర్ అయ్యాయి. ఒకప్పుడు ఈ పేమెంట్స్ స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ తప్పనిసరి. కానీ ఇప్పుడు ఇవేమీ అవసరం లేకుండానే యూపీఐ పేమెంట్స్‌ను చేసుకునే వెసులుబాటు అధించింది ఆర్‌బీఐ. యూపీఐ 123పే (UPI 123Pay), యూపీఐ లైట్ (UPI lite) వంటి రెండు పేమెంట్ మెథడ్స్ తీసుకు రావడం ద్వారా ఈ పని చేసింది. ఇప్పుడు వీటిని ద్వారా చేసే పర్ ట్రాన్సక్షన్ లిమిట్ (Transaction limit) పెంచింది ఆర్‌బీఐ. ఈ విషయాన్ని తాజాగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ధ్రువీకరించారు. మరి యూపీఐ 123 పే, యూపీఐ లైట్ వ్యాలెట్ ట్రాన్సక్షన్ల లిమిట్ ఎంత మేర పెరిగిందో తెలుసుకుందాం.
యూపీఐ 123 పే అనేది ఫీచర్ ఫోన్ (Feature phone) యూజర్లు కోసం తెచ్చిన ఒక ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్. స్మార్ట్‌ఫోన్ కొనలేని పేదవారికి సైతం యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో యూపీఐ 123 పేను ప్రారంభించారు. యూపీఐ 123 పే, యూపీఐ లైట్ ట్రాన్సక్షన్ లిమిట్స్ పెంచితే కొనుగోళ్లు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఆర్‌బీఐ (RBI) ఇప్పుడు యూపీఐ 123 పే ట్రాన్సక్షన్ లిమిట్‌ను రూ.10,000కి పెంచింది. యూపీఐ లైట్ వాలెట్ క్యాష్ లోడ్ ను రూ. 5,000కి ఇంక్రీజ్ చేసింది. అలానే యూపీఐ లైట్ పర్ ట్రాన్సక్షన్ పరిమితిని రూ.1,000కి పెంచింది.
ఈ నిర్ణయంతో గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్స్ (Digital payments) పెరుగుతాయని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. యూపీఐ 123పేతో ఫీచర్ ఫోన్ యూజర్లు ఐవీఆర్ నంబర్‌కు కాల్ చేయడం, యాప్, మిస్డ్ కాల్, సౌండ్ ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. యూపీఐ లైట్ బ్యాంక్ సేవలతో సంబంధం లేకుండా స్మాల్ ట్రాన్సక్షన్స్ చేసుకోవచ్చు.