Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

‘Papanna’ was a contemporary of Chhatrapati Shivaji. ఛత్రపతిశివాజీకి సమకాలికుడు ‘ పాపన్న’

-- తెలంగాణ తొలి బహుజన రాజు -- గోల్కొండకోట స్వాధీనంతో కొంత కాలం అధికారం -- భువనగిరి కోట రాజధానిగా ముప్పైయేళ్ళ పరిపాలన -- నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

ఛత్రపతిశివాజీకి సమకాలికుడు ‘ పాపన్న’

— తెలంగాణ తొలి బహుజన రాజు
— గోల్కొండకోట స్వాధీనంతో కొంత కాలం అధికారం
— భువనగిరి కోట రాజధానిగా ముప్పైయేళ్ళ పరిపాలన
— నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

ప్రజా దీవెన/హైదరాబాద్: నాటి సమాజంలో పీడితులు, బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు, గొప్ప సామాజిక బహుజన విప్లవకారుడు, కుల, మత, జాతి వర్గ విభేదాలు లేని సమాజం కోసం దాదాపు 350 ఏండ్ల కిందనే కృషి చేసిన బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.

ఆధిపత్య అగ్రకుల పాలకులు బహుజనులను అణగద్రోక్కుతున్న 17వ శతాబ్దంలోనే స్వీయ సైన్యంతో దక్కన్‌పై బహుజనుల సంక్షేమ బాధ్యత తీసుకొని తొలి బహుజన రాజ్య స్థాపన చేసిన గొప్ప వీరుడు, తొలి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. చరిత్రకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే కంటే ముందే సామాజిక న్యాయం అమలు చేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు.

రాచరికపు వ్యవస్థ నీడలో అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, జమీందార్లు, జాగీర్దాల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడు పాపన్న. ఖిలాషాపూర్‌ను కేంద్రంగా చేసుకొని మొఘలుల ఆధిపత్యాన్ని ఎదిరించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన బహుజన చక్రవర్తి అతను. పాపన్న జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ లో జన్మించాడు.

(1650-1709) నాసగోని ధర్మన్న, సర్వమ్మల కుమారుడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోతే అన్నితానై పెంచింది తల్లి సర్వమ్మ. ప్రజలు ప్రేమాప్యాయతలతో అతన్ని పాపన్న గౌడ్ అని పాపన్న దొర పిలిచేవారు. సర్వమ్మ మాత్రం పాపడు అని పిలిచేది. పాపన్న గౌడ కులస్థుల ఆరాధ్య దైవం ఎల్లమ్మకు పరమ భక్తుడు. అతడు శివున్ని కూడా ఆరాధించేవాడు.

తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు. ధూళిమిట్ట శాసనం ప్రకారం ఆగస్టు 18, 1650 నాడు పాపన్న గౌడ్ వరంగల్ జిల్లాలో గౌడ్ కులంలో జన్మించాడు. గౌడ చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తి ధూల్మిట్ట వీరగల్లు శాసనంలో ఇలా వుంది. ‘బండిపోత గౌడ షాపూర్ ఖిలా పులి గౌడ యేబది రొడ్డి షబ్బారాయుడ, పౌదరు పాపన్న గౌడ్. బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్ధితులు గమనిస్తూ స్నేహితులతో చర్చించేవాడు.

చిన్నతనం నుంచే ఆధిపత్య బ్రాహ్మణ భావజాల వ్యతిరేక బీజాలు పాపన్నలో ఏర్పడ్డాయి. నిత్యం పూజలు చేసే సంప్రదాయాలను యుక్త వయసు వచ్చే నాటికి క్రమక్రమంగా వ్యతిరేకించాడు. బానిసత్వం నుండి ప్రజలకు విముక్తి కల్పిస్తానని కులవృత్తి చేయనని తల్లితో ప్రతిజ్ఞ చేశాడు.పాపన్న ఎక్కువగా ఇతర కులాల వారితో కలిసి తిరిగేవాడు.

వీరిలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీరు సాహేబ్ పాపన్న ప్రధాన అనుచరులు. వీరందరూ బహుజనులు. తెలంగాణలో మెుఘల్ రాజుల ఆధిపత్యాన్ని అంతం చెయ్యాలని, తాబేదారులు, జమీందారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి బానిసత్వ విముక్తి కల్పించాలని గోల్కొండ కోటపై బహుజనుల జెండా ఎగుర వేయాలని నిర్ణయించాడు.

పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని, అధికారం కాని లేవు. 12,000 మందితో గెరిల్ల సైన్యాన్ని, 3000 మందితో పదాతి దళాలు, 500 మందితో రక్షక దళాలను ఏర్పాటు చేసుకున్నాడు. దళిత, గిరిజనులను చేరదీసి వారికి యుద్ధ విద్యలను నేర్పాడు.మొఘలు సైన్యంపై తన సైన్యంతో దాడి చేసి తన సొంత ఊరు ఖిలాషాపూర్‌ని రాజధానిగా చేసుకొని 1675లో సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు.

ఛత్రపతి శివాజీకి సమకాలికుడైన పాపన్న శివాజీ ముస్లింల పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణలో మొఘలుల పాలన అంతానికి పోరాడాడు. పాపన్న ఒక్కోప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు, కోటలు (21) నిర్మించుకొని 1678 వరకు తాటికొండ, వేములకొండలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.

కనుచూపు మేరలో శత్రువులను కనిపెట్టెలా కోటలు నిర్మించాడని చరిత్ర కీర్తిస్తుంది. ఆధునిక ఆయుధాలు కూడా ఉపయోగించినట్లు చారిత్రక ఆనవాళ్లు లభించాయి. కోటకు నాలుగు వైపులా బురుజులు, మధ్యలో ఎత్తైన మరో బురుజు, ఒక బురుజు నుంచి మరో బురుజు వైపు నడిచి వెళ్లేందుకు సరిపడా వెడల్పైన స్థలం, శత్రువులను ఎదుర్కొనేందుకు వీలుగా కోట గోడపై పిట్టగోడలకు అనువైన రంధ్రాలు ఉండడంతో పాటు ఈ కోట నుంచి బయటకు వెళ్లేందుకు మూడు సొరంగాలున్నాయి.

కోటలను శత్రువులకు అంతు చిక్కకుండా నిర్మించాడు. తెలంగాణలో మొఘలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే.అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, హుజురాబాద్ వరకు విస్తరించింది. పాపన్న ఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజల కష్టనష్టాలన్నీ తెలుసు.

అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు. ఖజానా కొరకు జమీందార్, సుబేదార్లపై తన గెరిల్ల సైన్యంతో దాడి చేయించేవాడు. వారి వద్ద నుంచి దోచుకున్న సొమ్ము ను ప్రజలకు పంచిపెట్టాడు. వారి భూములను కూడా ప్రజలకు పంచాడు. పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేసాడు. అతని రాజ్యంలో సామాజిక న్యాయం పాటించేవాడు.

తాటి కొండలో చెక్ డాం నిర్మించాడు. అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురాబాద్‌లో ఎల్లమ్మ గుడి కట్టించాడు. అది రూపం మారినా నేటికీ అలాగే ఉంది. ఒక సామాన్య గీత కార్మికుడు గోల్కొండ ప్రభువుగా ఉండడం గిట్టని అగ్రకుల ఆధిపత్య వర్గాలు ఢిల్లీ బహుదూర్ షాకు పాపన్నపై అసత్య ప్రచారాలు చేశారు. ఆ విషయాలు నమ్మిన ఢిల్లీ బహదూర్ షా పాపన్న సైన్యంపై దాడి చేసి ఆరు నెలలు పోరాడినట్లు చరిత్రకారులు చెబుతారు.యుద్ధం జరుగుతున్న రోజుల్లోనే (1710) ఓ రోజు రాత్రి పాపన్న ఉద్యమద్రోహి చేత పట్టుపడ్డాడు.

కొద్దిరోజుల తర్వాత పాపన్నను ఉరి తీసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి తలను ఢిల్లీకి పంపారని చరిత్రకారులు రిచర్డ్, హనుమంతరావులు తెలిపారు. పాపన్న ప్రయత్నాన్ని ద్వంద్వ తిరుగుబాటుగా వారు అభివర్ణించారు. మొఘలు ప్రభువుల అరాచకాలకు మత చాందస విధానాలకు వ్యతిరేకంగా 20 ఏండ్లు బహుజన రాజ్యవిస్తరణకు (ఓరుగల్లు నుండి గోల్కొండ వరకు)కృషి చేసాడు పాపన్న.

అగ్రవర్ణ భూస్వామ్య కులాల వారు చేసే ఆక్రమణలు దోపిడీలు, లూటీలు మాత్రమే నాటి చరిత్రలో గొప్ప పోరాటాలుగా చిత్రీకరించారు. ఆధిపత్యాన్ని ఎదిరించి, బానిసత్వాన్ని ధిక్కరించిన సర్వాయి పాపన్నను దోపిడీ దొంగగా చిత్రీకరించారు అగ్రవర్ణ చరిత్రకారులు.బహుజనుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడ్డ తొలి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను వక్రీకరించారు. నిరంకుశ ఆధిపత్యాన్ని, బ్రాహ్మణ వాదానికి (మనువాదం) వ్యతిరేకంగా పోరాడాలని శతాబ్దాల కిందనే పాపన్న ప్రజలకు తెలియజేశాడు.

కులం, మతం, వర్గం, జాతి వంటి సమాజ విచ్ఛిన్నకర అంశాలను పక్కనపెట్టి సమ సమాజ స్థాపన కోసం బహుజనుల ఐక్యంగా ఉద్యమించాలి. రాజ్యాధికారంలో బహుజనులు భాగస్వామ్యం కావాలి. పాపన్న చరిత్రపై పరిశోధనలు ఇంకా జరుగాల్సి ఉంది. లభించిన పురావస్తు ఆనవాళ్లను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పాపన్న విగ్రహాలను ఏర్పాటు చేసి పాపన్న వీర చరిత్రను ప్రజలకు తెలియచేయాలి.

భవిష్యత్ తరాల్లో స్ఫూర్తి నింపాలి. జనాభా దామాషా ప్రకారం ఉద్యోగాల్లో, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావలసిన సామాజిక బాధ్యత పాపన్న వారసులుగా బహుజనులందరిపైన ఉంది. నేడు పాపన్న జయంతి సందర్బంగా ప్రజా దీవెన ఘన నివాళి అర్పిస్తోంది.