Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Quran is a guide to the world: ప్రపంచానికి ఖురాన్ మార్గదర్శకం

-- భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రపంచానికి ఖురాన్ మార్గదర్శకం

— భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రజా దీవెన/ నల్లగొండ: పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రపంచానికి ఒక మార్గదర్శకమని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ మదీనా మస్జిద్ లో జరుగుతున్న రెండవ అఖిల భారత ఖురాన్, అజాన్ పోటీలకు శనివారం ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొని తిలకించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి సారి 2010 సంవత్సరంలో ఖురాన్ పోటీలు నిర్వహించినప్పుడు ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాను నల్లగొండ శాసన సభ సభ్యుడిగా మంత్రి హోదాలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు.

చిన్నపిల్లలు కూడా పేజీల కొద్దీ ఖురాన్ చదవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఖురాన్ ఒక విశ్వాసాన్ని, ఐక్యతను, వ్యక్తిగత జీవితంలో వృద్ధిని ప్రోత్సహిస్తుందని అన్నారు. ఖురాన్ పోటీలు నిర్వహిస్తూ యువతలో ఒక అంకితభావం పెంపొందించడం గొప్ప విషయం అన్నారు.

ఖురాన్, ఆజాన్ పోటీల విజయవంతం కోసం రేయి పగలు కృషి చేస్తున్న ఖిరాత్ కమిటీ ప్రత్యేకించి హాఫిజ్ ఖారి మొహమ్మద్ నిజాముద్దీన్ పట్టుదలను ఎంపీ కొనియాడారు.

ఈ సందర్భంగా సౌదీ అరేబియా అవార్డు గ్రహీత, కార్యక్రమ ముఖ్య జడ్జి ఖారి మొహమ్మద్ అలి ఖాన్ ఎంపీ గారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.