ఆదాయ పన్ను తప్పులపై తీవ్ర చర్యలు
— తెలుగు రాష్ట్రాల ఇన్‌కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనరు మిథాలీ మధుస్మిత
ప్రజా దీవెన/ హైదారాబాద్: ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఆదాయ వివరాలను తప్పుగా సమర్పించినా, అర్హత లేని మినహాయింపులు కోరినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆంధ్రా, తెలంగాణ ఇన్‌కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనరు మిథాలీ మధుస్మిత పేర్కొన్నారు. ఉద్దేశపూర్వక వివరాలు సమర్పిస్తే జైలుశిక్షతోపాటు 12 శాతం వడ్డీ, 200 శాతం పన్ను ఫెనాల్టీ రూపంలో వసూలు చేయనున్నట్లు హెచ్చరించారు.
హైదరాబాద్ కార్యాలయం నుంచి ఆమె మీడియా ప్రతినిధులతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ఈ ప్రక్రియలో తప్పుడు క్లెయిమ్స్ చేసి రీఫండ్ పొందిన పన్ను చెల్లింపుదారులు మదింపు సంవత్సరాలు 2021-22, 2022-23కు సవరించిన రిటర్స్స్ దాఖలు చేసి 140(బి) సెక్షన్ ప్రకారం పన్ను చెల్లించాలని సూచించారు. మదింపు సంవత్సరం 2023-24 కోసం ఇప్పటికే రిటర్న్స్ సమర్పించిన వారు 139(5) సెక్షన్ ప్రకారం సవరించిన రిటర్న్స్ దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రా, తెలంగాణల్లోని పలువురు ఉద్యోగులు తమకు అర్హత లేకపోయినప్పటికీ అసంబద్ధమైన మినహాయింపులు, తగ్గింపులు కోరుతూ 75 శాతం నుంచి 90 శాతం మంది రీఫండ్ తీసుకోవడానికి దరఖాస్తు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు.