ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను తాజాగా అరెస్ట్ చేశారు పోలీసులు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లో పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 39 ఏళ్ల మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యం, అతని భద్రతా సిబ్బందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగానే అతన్ని అరెస్ట్ చేశారు.
శుక్రవారం నాడు హైదరాబాద్ పోలీసు కమిషనర్ టాస్క్ ఫోర్స్ అధికారులు, చిక్కడపల్లి పోలీసులతో కలిసి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడానికి ఆయన ఇంటికి వెళ్లారు. పోలీసులు ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఇంతకుముందు ఈ కేసులో తన పేరును ఎఫ్ఐఆర్ నుండి తొలగించాలని కోరుతూ అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇంకా విచారణ జరగలేదు.
అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఆ వీడియోలో, పోలీసులు తనను తీసుకెళ్లే ముందు కనీసం బ్రేక్‌ఫాస్ట్ తినడానికి అనుమతించాలని అల్లు అర్జున్ కోరడం స్పష్టంగా వినిపిస్తుంది. అంతేకాదు కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా తనకు అవకాశం ఇవ్వరేంటి అని పోలీసులను ప్రశ్నించారు. బెడ్ రూమ్ లోకి వెళ్లి వస్తానన్నా వాళ్ళు వినలేదు. దాంతో పోలీసులపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. తనను తీసుకువెళ్లడంలో తప్పు లేదని కానీ మరీ బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకపోవడం అన్యాయం అని అన్నారు. ఈ సమయంలో ఆయన భార్య స్నేహారెడ్డి, తండ్రి అల్లు అరవింద్ కూడా అక్కడే ఉన్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అల్లు అర్జున్ ప్రీమియర్‌కు వస్తున్నట్లు వారికి ముందుగా సమాచారం లేదు. థియేటర్ యాజమాన్యం భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులను నియంత్రించడంలో సరైన ఏర్పాట్లు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. అల్లు అర్జున్, అతని బృందం కోసం ప్రత్యేక ప్రవేశం లేదా నిష్క్రమణ మార్గం లేకపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. ఈ కారణంగానే తొక్కిసలాట జరిగి ఒక మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో, ఈ అరెస్ట్ మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ₹1,000 కోట్లకు పైగా వసూలు చేసింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
