–టోల్ ఫ్రీ నెంబర్లను వినియోగించేది చాలా తక్కువే
–చిన్నారులకు విద్యాబుద్దులతో పాటు అత్యవసరం లో స్పందించే అంశాలను నేర్పించాలి
–పిల్లలకే కాదు, యువత, మహిళలకు ఏ నంబరుకు ఫోన్ చేయాలన్న విషయమై అవగాహన అవసరం
దేవరకొండ కు చెందిన చంద్రారెడ్డి కుటుంబంతో వెళ్లడానికి సిద్ధమయ్యారు. సమయం అయిపోతుందన్న తొందరలో తన పాత కారు తాళాలను లోపల వేసి డోర్ మూశారు. దీంతో లాక్ అయిపోయింది. అక్కడే ఉన్న నాలుగో తరగతి చదువుతున్న కూతురు వెంటనే యూట్యూబ్ లో సెర్చి చేసి పరిష్కారం చూపించింది.
మిర్యాలగూడ లో 16 ఏళ్ల అమ్మాయి రాత్రి సమయంలో స్కూటీపై వస్తోంది. మార్గమధ్యంలో నిర్మానుష్య ప్రాంతంలో పెట్రోల్ అయిపోయింది. వెంటనే డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీసులు పెట్రోల్ తెచ్చి ఇచ్చారు.
Emergency Numbers : ప్రజాదీవెన , నల్గొండ : ‘మా అమ్మను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపించండి. నా ఐస్క్రీం లాక్కుని తినేసింది’ అంటూ అమెరికాలోని ఓ నగరంలో నాలుగేళ్ల బాలుడు అక్కడి అత్యవసర పోలీసు సర్వీసు నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. అంత చిన్న వయసులో అత్యవసర నంబర్లు ఉంటాయని తెలియడమే విశేషం…. ఈ ఘటనను కాసేపు పక్కన బెడితే మన దగ్గర ఎన్నో అత్యాచారాలు, అఘా యిత్యాలు, మోసాలు, వేధింపులు ఘటనలు జరుగుతున్నా టోల్ ఫ్రీ నంబర్లను వినియోగించుకునేది చాలా తక్కువే.
మనం ఏదైనా సమస్య గురించి చర్చించేటప్పుడు పిల్లలు ఏదైనా చెబితే వెంటనే ఖండించేస్తాం. అందులో పనికొచ్చే విషయం ఉంటే తీసుకోవడం తప్పుకాదు. చిన్నారులకు విద్యాబుద్దులతో పాటు అత్యవసర సమయంలో స్పందించే అంశాలను నేర్పించాలి. పిల్లలకే కాదు, యువతకు, మహిళలకు అత్యవసర సమయంలో ఏ నంబరుకు ఫోన్ చేయాలన్న విషయమై అవగాహన కల్పించాలి.
—సమయస్ఫూర్తితో పరిష్కారం..
ఆపద సమయంలో తమ వద్ద ఫోన్ ఉన్నా ఏ నంబరుకు ఫోన్ చేయాలో తెలియక చాలా మంది సమస్యలో చిక్కుకుపోతున్నారు. సిగ్నల్ లేకున్నా అత్యవసర నంబరుకు కాల్ చేసే సదుపాయం ఉందన్న విషయం గుర్తించడం లేదు. ఆపదలో సమస్యకు ఎదురెళ్లి పోరాడాల్సిన పనిలేదు. సమయస్ఫూర్తితో సమస్యను బట్టి దాన్ని పరిష్కరించే వారికి చిన్నగా ఫోన్ చేస్తే చాలు.
—దుర్వినియోగం చేయొద్దు..
ఆపద సమయంలో ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన అత్యవసర నంబర్లు కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఆకతాయి చేష్టల వల్ల ఆపదలో ఉన్నవారు నష్టపోయే అవకాశం ఉంది. హాలియా మండలానికి చెందిన ఓ వ్యక్తి 108కి కాల్చేసి తన బంధువు గుండెనొప్పితో కుప్పకూలాడని సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి అంబులెన్స్ వెళ్లేసరికి ఫోన్ చేసిన వ్యక్తి స్విచ్ఛాఫ్ చేశారు. అదే సమయంలో మరోచోట రోడ్డు ప్రమాదం జరగగా అంబులెన్స్ వెళ్లడానికి ఆలస్యమయ్యింది. జిల్లా లోని ఓ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి డయల్ 100కు ఫోన్లు చేసి విసిగిస్తుండటంతో ఇటీవల కేసు నమోదు అయినట్లు సమాచారం.
—గుర్తించుకోవలసిన నంబర్లు ఇవే…
* పోలీసు -100
* మహిళా రక్షణ – 1091
* పిల్లల సంరక్షణ -1098
* గృహహింస -181
* అగ్ని ప్రమాదాలు -101
* అంబులెన్స్ -108
* సైబర్ నేరం -1030