Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kalyana Mandapams: ఏవి ఆ సందళ్లు… “నాటి పందిళ్లు”

–నాడంతా బంధువులు, ఇరుగుపొరుగుదే హడావుడి

 

— కనుమరుగవుతున్న నాటి సంప్రదాయాలు

 

— కరువైన ఆప్యాయ పలకరింపులు

 

ప్రజాదీవెన నల్గొండ బ్యూరో

Kalyana mandapam: “పిన్ని మా ఇంట్లో పెండ్లి పందిరి వేస్తున్నాం అందరూ తప్పకుండా రావాలి”.. ఎక్కడికి వెళ్లొస్తున్నావు అక్కా?.. పక్క వీధిలో రామా యమ్మ కుమార్తెను పెళ్లికూతురు చేసి వస్తున్నాం… పేరాంటాళ్లు ఎక్కడి కెళ్లారే.. పెళ్లికొడుకు మంగళస్నానానికి బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తోడుకురావాలి.. వీధిలోకి వెళ్లి అందరినీ కత్తిపీటలు తీసుకొని కూరగాయలు కొయ్యడానికి పిలవండర్రా.. వదినా! బియ్యం నూక ఉప్మా అయినా ఎంత రుచిగా ఉందే.. ఇంట్లో చేసుకుంటే ఇంత రుచి రాదెందుకే?.. బావా.. సాంబారు ఇంకాస్త పొయ్యనా? మరదలు పిల్లా సాంబారు వడ్డించడ – మేనా? నువ్వు పప్పన్నం పెట్టేదుందా?” ఇలాంటి మాటలు ఇప్పుడు జరుగుతున్న పెళ్లిల్లో వినిపించడం లేదు. ‘ఏవండీ.. సాయంత్రం మన ఊరు కల్యాణ మండపంలో మా బాబాయి కుమార్తె రిసెప్షన్ ఉంది.. త్వరగా వస్తే గిఫ్ట్ ఇచ్చి ఫొటో దిగి తినేసి వచ్చేద్దాం’ ఇలాంటి పిలుపులే ఇప్పుడు వినిపిస్తున్నాయి.

 

—ఫొటో పోజిచ్చి.. రెండు మెతుకులు తినేసి

పట్టణాల్లో కల్యాణ మండపాల్లో పెళ్లిళ్లు (Traditional Indian weddings) జరగడం అనేది ఎప్పటినుంచో జరుగుతున్నదే. కానీ ప్రస్తుతం గ్రామాల్లో కూడా పెళ్లిళ్లు ఇళ్లముందు జరగడం లేదు. మండల కేంద్రంలో లేక సమీప పట్టణాల్లోని కల్యాణ మండపాలను బుక్ చేసుకుని నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల్లో కూడా సౌకర్యాలతో కల్యాణ మండపాలు అందుబాటులో ఉన్నాయి. దగ్గర బంధువులు ఆ ముహూర్తం సమయానికి వచ్చి అక్షింతలు వేసి ఫొటో పోజిచ్చి రెండు మెతుకులు తినేసి పోతున్నారు.

 

—అన్ని ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయంటే నమ్మగలరా?

 

మనుషులు ఎంత బిజీ అయిపోయారంటే.. ఒక ఇంట్లో జరగాల్సిన నిశ్చితార్థం కూడా కల్యాణ మండపం (Kalyana mandapams)లో జరిపిస్తున్నారు. అసలు పెళ్లిచూపులే ఉండడం లేదు. అవీ ఆన్లైన్లో జరు గుతున్నాయంటే నమ్మగలరా? కల్యాణ మండపంలో పెళ్లి చేసినా ఇంటిముందు పందిరి వేయడం సంప్రదాయం. దీన్ని పాటించే వారు అరుదు. కల్యాణ మండపం బుక్ చేసుకున్న దగ్గర నుంచి భోజనాలు, డెకరేషన్, మంగళ స్నానం చేయించడం అన్నీ ఎవరికో గుత్తేదారులకు అప్పగిస్తున్నారు. బంధువులే వధూవరులకు మంగళ స్నానాలు చేయించాలి. కానీ దీన్ని కూడా ఈవెంట్స్ వారికి అప్పగిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యం పేరం టాళ్లు పెళ్లిలో హడావుడి అంతా వీరిదే పెద్దవాళ్లు ఎవరైనా పెళ్లికి వచ్చి ఇక్కడ పేరంటళ్ళు ఎవరమ్మా అని అడిగితే.. అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు.. ఈవెంట్స్ వాళ్లే అన్ని చూసుకుంటారు. అని సమాధానం ఇస్తున్నారు.

 

—పేరంటాళ్ళుగా ఉండటం అదృష్టం..

 

కె. కొండమ్మ (నల్గొండ)

మా వీధిలో ఏదైనా పెళ్లి జరిగితే మూడు రోజులపాటు మా ఇంటి పొయ్యి వెలిగించం. అన్ని పనులు వీధిలో మహిళలంతా కలిసి చేసేవాళ్లం. అసలు పేరాంటాళ్లుగా ఉండే అవకాశం రావడం ఎంతో అదృ ష్టంగా భావించేవాళ్లం.

 

—పెళ్లంటనే బంధువుల సందడి…

ఎం. వెంకటేశం (నకిరేకల్)

ఇప్పటి పెళ్లి వేడుకలో బంధువుల సందడి కంటే ఈవెంట్ వారి హడావుడే ఎక్కువైపోతోంది. అదేంటో నాలుగైదు రోజులు ఈవెంట్స్ వారు తిష్ఠ వేస్తున్నారు. బంధువులేమో పెళ్లి ముహూర్తానికి వచ్చిపోతున్నారు. ఆప్యాయ పలకరింపులు కొరవడుతున్నాయి.