Approval for ‘RTC’…! ‘ ఆర్టీసి ‘ కి అమోదం…!
-- ఎట్టకేలకు ఎర్రబస్సు కు గ్రీన్ సిగ్నల్ -- ఆర్టీసి విలీన, మున్సిపల్ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఒకే -- మరో రెండు రోజులు సమావేశాల పొడిగింపు
‘ ఆర్టీసి ‘ కి అమోదం…!
— ఎట్టకేలకు ఎర్రబస్సు కు గ్రీన్ సిగ్నల్
— ఆర్టీసి విలీన, మున్సిపల్ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఒకే
— మరో రెండు రోజులు సమావేశాల పొడిగింపు
ప్రజా దీవెన/ హైదరాబాద్: అనుమానాలు, అపోహలు, గందరగోళాల మధ్య మొత్తానికి ఆర్టీసి ఉద్యోగుల కల నెరవేరింది. ఆర్టీసి విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలుపడంతో అనేక సంశయాలకు తెరపడింది.
ఏది ఏమైనా ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లు, పురపాలక చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. రోడ్డు రవాణా శాఖ మంత్రి మంత్రి పువ్వాడ ఆర్టీసీ బిల్లును సభలో ప్రవేశపెట్టగా, పురపాలక చట్ట సవరణ బిల్లును మున్సిపల్ మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా మాట్లాడిన పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ కార్పొరేషన్, ఆస్తులు యధాతథంగా ఉండటంతో పాటు కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్‌సీ ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని చెప్పారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. గవర్నర్ తమిళిసై అనుమతి ఇవ్వడంతో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు.
ఆర్టీసీ కార్యకలాపాలు ఎప్పటిలాగానే కొనసాగుతాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ. 3 వేల కోట్లు భారం పడనుందని వివరించారు. ఉద్యోగులతో చర్చించి పదవీ విరమణ ప్రయోజనాలు నిర్ణయిస్తామని వ్యాఖ్యానించారు. ఆర్టీసీలో ప్రస్తుతం 43 వేల 55 మంది ఉద్యోగులు ఉన్నట్లు పువ్వాడ అజయ్‌కుమార్ సభకు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్ రూల్స్ ప్రకారం కొనసాగుతారని స్పష్టతనిచ్చారు.
*మరో రెండు రోజులు* ….అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు కొనసాగనున్నాయి. తొలుత అనుకున్న షెడ్యూలు ప్రకారం ఆదివారంతో ముగియాల్సి ఉన్నది. కానీ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్టు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో దాన్ని ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టి, చర్చలు జరిపి, ఆమోదం పొందేందుకు తగినంత సమయం అవసరమని భావించిన నేపథ్యంలో ప్రాథమికంగా మంగళవారం వరకు నడపాలనే నిర్ణయం జరిగింది.
అప్పటికీ పూర్తికాకపోతే మరికొంత సమయం కూడా పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆర్టీసీ డ్రాఫ్టు బిల్లును రాజ్‌భవన్‌కు ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన పంపింది. మూడవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నందున వెంటనే ప్రవేశపెట్టి చర్చించి ఆమోదం పొందవచ్చని భావించింది. కానీ పరిశీలన కోసం, సందేహాల నివృత్తి కోసం నాలుగు రోజుల సమయాన్ని గవర్నర్ తీసుకున్నందున అసెంబ్లీ సెషన్‌ను కూడా రెండు రోజుల పాటు పొడిగించాల్సిన అవసరం ఏర్పడింది.