Clean and green:పరిసరాల పరిశుభ్రతే రక్ష
:వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలోవ్యాధుల ముప్పు పొంచి ఉంది. విష జ్వరాల బారినుంచి కాపాడుకునేందుకు పరిసరాల పరిశుభ్రత పాటించడం అత్యంత ఆవశ్యకం.
సమీపిస్తున్న వర్షాకాలం.. పొంచి ఉన్న ప్రమాదం
అవగాహన పెంచుకోవడం ద్వారానే నివారణ సాధ్యం
నేడు డెంగీ నివారణ దినం
ప్రజా దీవెన నల్లగొండ బ్యూరో:వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలోవ్యాధుల ముప్పు పొంచి ఉంది. విష జ్వరాల(Fevar) బారినుంచి కాపాడుకునేందుకు పరిసరాల పరిశుభ్రత పాటించడం అత్యంత ఆవశ్యకం. దోమల ద్వారా వచ్చే జ్వరాల నుంచి మనల్ని మనమే రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో అనేక మంది డెంగీ బారిన పడుతుంటారు. అవగాహన పెంచుకోవడం ద్వారా డెంగీ(Dengue) బారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. గురువారం నల్లగొండ జిల్లావ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీ నిర్వహించారు. నేడు డెంగీ నివారణ దినం సందర్భంగా ప్రజా దీవెన కథనం.
లక్షణాలు…
డెంగీ చాలా వరకు ఇబ్బంది పెట్టకుండానే తగ్గి పోతున్నా.. కొందరిలో తీవ్రంగా పరిణమిస్తుంది. ప్లేట్లెట్లు తగ్గడం, రక్తం చిక్కపడటం, రక్తస్రావం వంటి పరిణామాలకు దారితీస్తుంది. సకాలంలో చికిత్స తీసుకుంటే దీనిని చాలా వరకు నివారించుకోవచ్చు. దోమలు(Mosquitoes)కుట్టకుండా చూసుకుంటే అసలు డెంగీ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. డెంగీకి మూలం ప్లేవీ వైరస్లలు. వీటిల్లో డెంగీ-1, డెంగీ-2, డెంగీసి, డెంగీ-4 ఇలా నాలుగు ఉపజాతులు న్నాయి. ఇవి ఆడ ఈడిస్ ఈజిప్టై(Female Aedes aegypti) దోమ కుట్టడం ద్వారా వ్యాప్తిచెందుతాయి. ఒక ఉపజాతి వైరస్ తో ఇన్ఫెక్షన్ వస్తే జీవితంలో మరెన్నడూ తిరిగి దానితో జ్వరం రాదని వైద్యనిపుణులు చెబుతు న్నారు. మరో ఉపజాతి ద్వారా డెంగీ తిరిగి సోకేఅవకాశం ఉందని పేర్కొటున్నారు.
–హఠాత్తుగా జ్వరం రావడం, భరించలేని తలనొప్పి, కళ్ల వెనకనుంచి నొప్పి మొదలవడం, కళ్లు ఎర్రబడటం, వాంతి-వికారం, ఒళ్లు, కీళ్ల నొప్పులు, ఆకలి మందగించడం, చర్మంమీద ఎర్రటి దద్దుర్లు, దురద కూడా ఉండవచ్చు. రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి
–డెంగీ జ్వరం చికెన్ గున్య కంటే ఎక్కువగా శరీరంలోని శక్తిని హరిస్తుంది. దోమ కుట్టిన 3- 14 రోజుల సమయంలో లక్షణాలు కనిపిస్తాయి. విషమదశలో పొట్టఉబ్బడం, ఆయాసం, మగత, కాళ్లుచేతులు చల్లబడటం లాంటి లక్షణాలుంటే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాలి.
వ్యాప్తికి కారణాలు…
నిల్వ ఉన్న నీటిలో ఈడీస్ ఈజిప్లై దోమ పురుడుపోసుకుంటుంది. పగటి సమయంలోనే ఇవి ఇళ్లలోకి ప్రవేశించి మనల్ని కుడతాయి. వైరస్ ను ఒకరినుంచి మరొకరికి వ్యాపింపజేస్తాయి. వాడని నీటి ట్యాంకులు, టైర్లు, తాగి పడేసిన కొబ్బరి బొండాలు, పాతకూలర్లు, నిల్వ ఉన్న నీరు వీటికి ఆవాసాలు. వీటిల్లో గుడ్లు పెట్టి సంతతిని పెంచుతాయి. ఈ దోమలు ఆహార సేకరణలో భాగంగా మనుషులను కుట్టి రక్తాన్ని తాగుతుంటాయి. ఇలాంటి సందర్భంలో డెంగీసోకే ప్రమాదం ఉంది. ఈ దోమ ఎక్కువ దూరం వెళ్లలేదు కాబట్టి ఒకే ఇంట్లో ఉన్న వారిని కుట్టడం ద్వారా ఎక్కువ మంది జ్వరం బారిన పడే అవకాశం ఉంది.
నిర్ధారణ… చికిత్స
దోమ కుట్టిన తర్వాత వచ్చే ప్రతి జ్వరం డెంగీ కాకపోవచ్చు. 1-5 రోజులో ఎస్.ఎస్-1 యాంటీ జెన్ పాజిటివ్గా తేలితే డెంగీ జ్వరంగా నిర్ధారణ చేస్తారు. ప్లేట్లెట్లు లక్షకు మించి తగ్గితే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. 50 వేలకు మించి తగ్గితే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాలి. 20 వేలకు మించి తగ్గితే ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు.
జాగ్రత్తలే కీలకం…
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకో చూసుకోవాలి. దోమతెరలు వాడాలి. చేతులు, కాళ్లకు నిండుగా ఉండే వస్త్రాలను ధరించాలి. చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. సాయంత్రం ఆరు తర్వాత ఎక్కువగా బయట ఉండకుండా చూడాలి. కూలర్లు వాడని సమయంలో అందులో ఉన్న నీటిని వెంటనే తొలగించాలి. ఇంటి ఆవరణలో బకెట్లు, డ్రమ్ముల్లో చాలారోజులుగా నీరు ఉంటే వాటిని తీసివేయాలి. దోమలు ఇంటిలోకి రాకుండా కిటికీలకు, తలుపులకు ప్రత్యేకంగా జాలీలు ఏర్పాటు చేసుకో వాలి. మురుగు కాలువలు, ఇళ్ల మధ్య ఉండే నీటి గుంటల్లో గంబూ షియా చేపలను వదలాలి. ఇవి దోమల లార్వాలను తింటాయి.
గత ఐదేళ్లుగా నమోదైన కేసుల వివరాలు…
2020వ సంవత్సరంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 2021లో 75 కేసులు, 2022లో 128, 2023లో 241, 2024లో నేటి వరకు 31 కేసులు నమోదయ్యాయి. అయితే అత్యధికంగా గత సంవత్సరం డెంగ్యూ కేసులు నమోదు కావడం గమనార్హం.
అవగాహన కల్పిస్తున్నాం..
( దుర్గయ్య… జిల్లా మలేరియా నివారణ అధికారి )
డెంగీ నివారణ కోసం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు చేపడు తున్నాం. ఆశాలు, ఏఎన్ఎంలు లు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు.ర్యాలీలు,పోస్టర్లు,కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. అంతేకాకుండా పీహెచ్సీలు, సబ్ సెంటర్లలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం.
దోమలు కుట్టకుండా చర్యలు చేపడితేనే డెంగీ నివారణ సాధ్యం. పరిసరాలు, ఇంటి చుట్టుపక్కన చెత్త, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలి. ప్రతి మంగళ, శుక్రవారాలను డ్రై డే గా పాటిస్తున్నాం.
గ్రామాల్లో సర్వే చేసి జ్వర లక్షణాలుంటే టి-హబ్ ద్వారా ఉచితంగా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాం. డెంగీ చికిత్సకు అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రతీ ఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకోవాలి.
Clean and green in society