CM Revanthreddy : లోక్ సభ సమరానికి సిఎం రేవంత్ సన్నద్ధం
--సిఎం హోదాలో రాష్ట్రంలో తొలి ఎన్నికల పోరు --ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెల్లిలో, 5న కొడంగల్‌లో పర్యటన
లోక్ సభ సమరానికి సిఎం రేవంత్ సన్నద్ధం
–సిఎం హోదాలో రాష్ట్రంలో తొలి ఎన్నికల పోరు
–ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెల్లిలో, 5న కొడంగల్‌లో పర్యటన
ప్రజా దీవెన/ హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల సమరానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సర్వం సన్నద్ధమవుతోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ప్రజలకు మధ్యకు వెళ్లి కాంగ్రెస్ తరఫున ప్రచారానికి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు.
ఓవైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి జనానికి మరింత చేరువయ్యేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే సీఎం ఇంద్రవెల్లి, కొడంగల్ పర్యటనలు దాదాపు ఖరారయ్యాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పిబ్రవరి 2వ తేదీన ఉదయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఉన్న నాగోబా దేవాలయాన్ని సందర్శిoచిన తర్వాత ఆయన అమరుల స్మారక స్తూపం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో పర్యటించనున్నారు.
అక్కడ నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. దీంతో తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వాతవరణం వేడెక్కనుంది. అధికార పార్టీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ఎన్నికల ప్రచారంతో రణరంగం లో దూకుతుండడంతో ప్రతిపక్ష బిఅర్ఎస్, బిజెపి పార్టీలు సైతం పరిస్థితులను నర్మగర్భంగా పరిశీలిస్తున్నాయి.
అధికార పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలను నిశితంగా పరిశీలించి ఆ తరువాత తమ తమ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఏదిఏమైనా తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వాతవరణం ప్రారంభమైనట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి 12 సీట్లకు పైగా గెలుపొందడమే లక్ష్యంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కాగా నెల రోజుల వ్యవధి లో మొత్తం గా రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పగడ్బంది రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది అటు ఏఐసిసి, మరోవైపు రాష్ట్ర పార్టీ.
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొకటిగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వలోని కాంగ్రెస్ ప్రభుత్వం లోక్ సభ ఎన్నికల్లో సైతం ప్రజల మద్దతు కూడగట్టేందుకు సర్వశక్తులు వడ్డేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సర్వం సన్నద్ధమవుతుంది.
మొత్తానికి రాష్ట్రంలో జరగనున్న లోక్సభ ఎన్నికల సమరం లో పార్టీల మధ్య హోరాహోరీ పోరు రసవత్తరంగా మరణం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో పదేళ్ల అధికారం తర్వాత ఓటమి చెందిన బిఆర్ఎస్ పార్టీ అంతర్మదనంతో అవలోకనం చేసుకుంటున్న సందర్భంలో లోక్ సభ పోరు ఆ పార్టీకి ఛాలెంజ్ కానుంది. ఇక బిజెపి పార్టీ విషయానికొస్తే ఇటీవల అయోధ్యలో అంగరంగ వైభవంగా రామాలయం ప్రారంభోత్సవంతో దేశవ్యాప్తంగా మంచి బూస్టింగ్ వచ్చిన సందర్భంలో బిజెపి కూడా మెజార్టీ స్థానాలు సాధించుకోవాలన్నా దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. మూడు పార్టీల మధ్య లోక్ సభ ఎన్నికల రణరంగం ఎలా ఉండబోతుందని వేచి చూడాల్సి ఉంది.