గ్రూప్-2 షెడ్యూల్ మార్పులు తెలుసా…!
ప్రజా దీవెన/హైదరాబాద్: తెలంగాణ గ్రూపు-2 పరీక్షలను టీఎస్పీఎస్సీ రీ షెడ్యూల్ చేసింది. అభ్యర్థుల కోరిక మేరకు నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పరీక్షలకు వారం రోజుల ముందు ఆన్ లైన్ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.
ఆయితే ఈనెల 29, 30వ తేదీల్లో జరుగాల్సిన గ్రూపు-2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన విషయం విదితమే. అంతకుముందు అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరీక్షలను నవంబరుకు వాయిదా వేస్తున్నట్లు శనివారం రాత్రి ప్రకటించగా పరీక్ష తేదీలను రీ షెడ్యూల్ చేస్తూ టీఎస్ పీఎస్సీ అధికారులు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో గ్రూప్-2 కింద 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 29న టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.