Dussehra sweet talk of travelers: ప్రయాణీకుల దసరా తీపి కబురు
-- ముందస్తు టికెట్ బుకింగ్ పై 10 శాతం రాయితీ
ప్రయాణీకుల దసరా తీపి కబురు
— ముందస్తు టికెట్ బుకింగ్ పై 10 శాతం రాయితీ
ప్రజా దీవెన/హైదరాబాద్: రాఖీ పండుగ సందర్బంగా గడించిన ఆదాయ అనుభవంతో ఉత్సాహంగా దూసుకెళ్తోంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఆ క్రమంలో దసరా పండుగ కు కూడా ప్రయాణికులకు తీపి కబురు అందించనుంది. దసరా సందర్భంగా ముందస్తు టికెట్ బుక్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది.
అక్టోబర్ 15 వ తేదీ నుంచి 29 వరకు ఆర్టీసీలో అప్ అండ్ డౌన్ రెండూ ఒకే దఫా టికెట్లు బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో టికెట్ పై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వారికి ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని ఆర్టీసీ పేర్కొంది.
గత నెలలో రాఖీ సందర్భంగా ఆర్టీసీకి భారీగా ఆదాయం రూ. 22.65 కోట్ల ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే. గతేడాది రాఖీ పండుగ రోజున రూ. 21.66 కోట్ల ఆదాయం రాగా ఈ సారి రూ. కోటి వరకు అదనంగా ఆదాయం వచ్చిన సంగతి తెలిసిందే.
ఆగస్టు 30న తెలంగాణ వ్యాప్తంగా 9 వేల బస్సులు నడపగా రూ.18.25 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు అప్పుడే ప్రకటించారు. రాఖీ పండుగ రోజు 40.91 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని, గతేడాదితో పోల్చితే అదనంగా లక్ష మంది రాకపోకలు చేశారని వెల్లడించారు.
ఆక్యుపెన్సీ రేషియో విషయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా గతేడాది రికార్డును అధిగమించిందని, దసరా కూడా భారీగా ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించే అవకాశం ఉందని ధీమా వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తామని వెల్లడించింది.