భద్రాచలం మాజీ ఎమ్మెల్యే హఠాన్మరణం
ప్రజా దీవెన/భద్రాచలం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భద్రాచలం జిల్లా లో విషాద ఛాయలు అలుముకున్నాయి. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి హఠాన్మరణం చెందారు.
ఆదివారం రాత్రి సమయంలో ఉన్నఫలంగా తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. భద్రాచలంలోని ఆమె నివాసంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు.
ఆమె మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుంజా సత్యవతి రాజకీయ జీవితం సీపీఎం పార్టీలో ప్రారంభo కాగా ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తొలుత 1991లో భద్రాచలం ఎంపీపీగా ఎన్నికైన అమే 2009లో భద్రాచలం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. అసెంబ్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిటీ, ఎస్టీ కమిటీ, ఎంప్లాయిమెంట్ ఇన్ ప్రాస్ట్రక్చర్ స్టాండింగ్ కమిటీలకు సభ్యురాలుగా పనిచేసింది.
వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంత కాలం ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఆ తరువాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్లి ఆ తర్వాత కొన్నాళ్లకే మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు.