Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Heavy rains again మళ్లీ భారీ వర్షాలు

 

మళ్లీ భారీ వర్షాలు

— –బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం

ప్రజా దీవెన / హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో మారు రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో మయన్మార్, బంగ్లాదేశ్ సమీపంలోని మేఘాలు తెలుగు రాష్ట్రాలను ఆవరించాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఇక ఇవ్వాల, రేపు కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్, మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉండనుంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

మరోవైపు ఆవర్తన ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆవర్తన ప్రభావం ఈ ప్రాంతాల్లో ఉంటుందని పేర్కొంది. ఐతే రాయలసీమపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది.

చెన్నై సమీపంలోని బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడిందని, అది బలపడిదే రాయలసీమలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇదిలా ఉండగా భారీ వర్షాలతో హిమాచల్‌ ప్రదేశ్‌ అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడి 50 మందికి పైగానే మృత్యువాత పడ్డారు.

హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో అక్కడి జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లోని సిమ్లా-కల్కా హైవే సమీపంలోని శివాలయంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో 50 మందికి పైగా మృతి చెందన విశయం తెలిసిందే.

శివాలయం శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. శ్రావణ మాసం కావడంతో ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

కాగా సిమ్లాలో రెండు చోట్ల కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ అధికారులు సమాచారం అందించారు. భారీ వర్షాల కారణంగా 92/6-92/7 వద్ద జుటోగ్ – సమ్మర్ హిల్ రైల్వే స్టేషన్ల మధ్య కల్కా-సిమ్లా రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.

దీంతో కందఘాట్-సిమ్లా మధ్య రైళ్ల రాకపోకలు నిలిచపోయాయి. ఆయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణనష్టం జరిగినందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం సంతాపం తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రదేశాలలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణనష్టం చాలా బాధాకరమన్నారు. స్థానిక ప్రభుత్వంతో పాటు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.