Minister’s whirlwind visit to Suryapet సూర్యాపేటలో మంత్రి సుడిగాలి పర్యటన
--దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఏకైక సీఎం కేసీఆర్ -- శరవేగంగా సూర్యాపేట పట్టణ సుందరీకరణ పనులు -- మహోన్నత వ్యక్తి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం
దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఏకైక సీఎం కేసీఆర్
— విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి
ప్రజా దీవెన/సూర్యాపేట: దివ్యాంగుల ఆత్మగౌరవానికి మరింత గుర్తింపు తెచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. దివ్యాంగులకు కేసీఆర్ పెంచిన పెన్షన్ వారి ఆత్మగౌరవాన్ని పెంచిందని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం లో పెంచిన పెన్షన్ ను తీసుకున్న దివ్యాంగులు సిఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి ల చిత్ర పటాలను పాలాభిషేకం నిర్వహించారు. పెన్ పహాడ్ మండలం లోని దూపహడ్ గ్రామం లో కార్యక్రమానికి హాజరైన మంత్రి ని కలిసిన దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచిన గొప్ప మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని అన్నారు. దివ్యాంగులు మాట్లాడుతూ వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం చాలా సంతోషంగా ఉందని, దివ్యాంగుల పట్ల గ సీఎం కేసీఆర్ చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
శరవేగంగా సూర్యాపేట సుందరీకరణ పనులు
–సద్దుల చెరువు నలుమూలలా పచ్చదనం
— అహ్లాధంతో ఆకట్టుకుంటున్న సెల్ఫీ పాయింట్లు
–పనులను పర్యవేక్షించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట: సూర్యాపేట పట్టణం లో సుందరీ కరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సారథ్యం లో అందమైన, అపురూపమైన పట్టణంగా రూపు దిద్దుకుంటున్న సూర్యాపేట పట్టణంలో ని మెడికల్ కాలేజ్, సద్దుల చెరువు మినీ టాంక్ బండ్ వద్ద పూర్తైన, ఇంకా పూర్తి కావాల్సిన పనులను మంత్రి జగదీష్ రెడ్డి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. కాగా ఇప్పటికే గ్రీనరీ తో పూర్తైన ఐ లవ్ సూర్యాపేట, తెలంగాణా వంటి గ్రీనరీ బోర్డ్ లు సెల్ఫీ పాయింట్లు గా మారిపోయాయి. టాంక్ బండ్ నుండి హైవే వరకు చెరువు కట్ట పొడవునా దిగువన ఏర్పాటు చేసిన రక రకాల పూల మొక్కలు వాహనదారులను కనువిందు చేస్తున్నాయి. దాదాపు పట్టణంలో రెండు గంటల పాటు పర్యటించిన మంత్రి, ఎన్టీఆర్ చౌరస్తా, జనగాం క్రాస్ రోడ్స్ లో ఆధునికరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పచ్చదనం ఉట్టిపడేలా చౌరస్తాలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా దెబ్బతిన్న ఎన్టీఆర్ పార్క్ వద్ద గల రహదారులను వెంటనే మరమ్మత్తు చేయాలని అధికారులు సూచించారు. మెడికల్ కాలేజీ హాస్టల్ విద్యార్థుల కోసం, వారికి ఇబ్బందులు తలెత్తకుండా మరో గేటును ఏర్పాటు చేయాలని సూచించారు. సాధ్యమైనంత తొందరగా నాణ్యతతో కూడిన గ్రీనరీ పనులను పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. సూర్యాపేట ను దేశంలోనే నెంబర్ వన్ పట్టణంగా తీర్చిదిద్దడానికి జరుగుతున్న యజ్ఞంలో అధికారులకు తోడుగా ప్రజలు కూడా భాగస్వామి అందించాలని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.
మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం
–క్యాంపు కార్యాలయం కలాం వర్ధంతి కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట:భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని,
భారత్‌లోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన వారిలోఅబ‍్దుల్ కలాం ఒకరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. సూర్యాపేట లోని మంత్రి క్యాంపు కార్యాలయం లో కలాం వర్ధంతి వేడుకలలో పాల్గొన్న మంత్రి ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఎంతోమంది ఆరాధించారని గుర్తుచేసుకుంటూ హృదయపూర్వకంగా నివాళులు అర్పించారు. దేశానికి మాజీ రాష్ట్రపతి కలాం చేసిన కృషి వెలకట్టలేనిదని, ఆయన సేవలు చిరస్మరణీయమని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.