Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

శృంగార సమ్మతి వయసు తగ్గించాలి

తప్పు ఇరువైపులా ఉన్నా బాలురే దోషులవుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు సూచన

శృంగార సమ్మతి వయసు తగ్గించాలి

తప్పు ఇరువైపులా ఉన్నా బాలురే దోషులవుతున్నారు

కేంద్ర ప్రభుత్వానికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు సూచన

ప్రజా దీవెన/ గ్వాలియర్‌: మారిన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో శృంగారానికి సమ్మతి తెలిపే వయసును బాలికలకు 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టు గ్వాలియర్‌ ధర్మాసనం అభిప్రాయపడింది..

తద్వారా కిశోరప్రాయ(టీనేజ్‌) బాలురను చట్టపరమైన చర్యల నుంచి కాపాడవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 2020లో ఒక బాలికను పదేపదే మానభంగం చేసి, గర్భవతిని చేశాడంటూ ఒక యువకునిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు జూన్‌ 27న కొట్టివేసింది. ఈ సందర్భంగా కేంద్రానికి ఈ సూచన పంపింది. ప్రస్తుత కేసులో ఫిర్యాదీ 2020లో బాలిక. అప్పట్లో ఆమె ఒక వ్యక్తి వద్ద విద్యాపరమైన శిక్షణ పొందేది. అతడు ఒకరోజు మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చి తనను అత్యాచారం చేశాడని, దాన్ని వీడియో తీసి బెదిరిస్తూ పదేపదే తనను లొంగదీసుకుంటున్నాడని ఆరోపించింది. తరవాత ఆమెకు ఒక సన్నిహిత బంధువుతోనూ శారీరక సంబంధం ఉన్నట్లు తేలిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్‌ వల్ల బాలబాలికలకు 14 ఏళ్ల వయసులోనే పెద్దరికం వస్తోందనీ, బాలికలు 14 ఏళ్లకే యవ్వన దశకు చేరుకుంటున్నారని హైకోర్టు న్యాయమూర్తి దీపక్‌ కుమార్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. కిశోరప్రాయంలోనే బాలబాలికలు పరస్పర శారీరక ఆకర్షణలకు లోనవుతున్నారని తెలిపారు. ఇందులో ఇద్దరి తప్పిదం ఉన్నప్పటికీ బాలురు నేరారోపణలను ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు..