Summer: పెరుగుతున్న ఉష్ణొగ్రతలు
వేసవిలో భానుడి వేడి మాత్రమే కాదు.. దాంతోపాటు విద్యుత్తు వినియోగం కూడా పెరుగుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వినియోగించే ఎయిర్ కండిషనర్(AC)లు
విద్యుత్ కు డిమాండ్
వేసవితాపంలో ఏసీల వినియోగం అధికం
గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌లతో ఉత్పత్తి
ప్రజాదీవెన, ఢిల్లీ: వేసవిలో భానుడి వేడి మాత్రమే కాదు.. దాంతోపాటు విద్యుత్తు వినియోగం కూడా పెరుగుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వినియోగించే ఎయిర్ కండిషనర్(AC)లు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో రావడంతో ఈ డిమాండ్ నానాటికీ పెరుగుతూ పోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే దక్షిణాది రాష్ట్రాల్లో ఎండ వేడి పెరిగిపోగా.. ఈ సీజన్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని (Indian Meteorological Department) భారత వాతావరణ శాఖ (IMD) సైతం హెచ్చరించింది.
ఈ పరిస్థితుల్లో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో విద్యుత్ డిమాండ్ కూడా ఆ మేరకు పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ‘విద్యుత్ చట్టం – 2003’లోని సెక్షన్ 11ను ప్రయోగించింది. ప్రత్యేక – అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్తును ఉత్పత్తి చేసే సంస్థలను నియంత్రించే అధికారాన్ని ఈ సెక్షన్ కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతోంది. ఆ మేరకు ఏ విద్యుత్తు సంస్థ తమ గరిష్ట సామర్థ్యానికి లోబడి ఎంత మొత్తంలో విద్యుత్తు ఉత్పత్తి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పుడు దేశంలో పెరిగిన (Electricity demand) విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్రం సెక్షన్ 11ను ప్రయోగిస్తోంది.
పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తీర్చడం కోసం గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 11 ప్రకారం అన్ని గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో గ్యాస్ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఉపయోగంలో లేవు. డిమాండ్ పెరిగినప్పుడు మాత్రమే వీటి నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసి కొరత లేకుండా చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెక్షన్ 11 ఉత్తర్వులు 2024 మే 1 నుంచి జూన్ 30 వరకు విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ అంశాల్లో అమల్లో ఉంటాయి. దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు సమానంగా గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత విద్యుత్తు, గ్యాస్ ఆధారిత విద్యుత్తు రెండూ కూడా ఇతర విధానాల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తు కంటే ఖరీదు ఎక్కువ. కొరత ఏర్పడే పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం ఈ రెండు రకాల విద్యుత్తును ఉత్పత్తి చేయించి వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది.
దేశీయ విద్యుత్తు అవసరాలు, ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు లెక్కలు వేసే గ్రిడ్-ఇండియా సంస్థ ఈ విషయంలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. సెక్షన్ 11 ప్రకారం గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్లు ఎంత మేర విద్యుత్తు ఉత్పత్తి చేయాలన్నది గ్రిడ్-ఇండియా నిర్ణయిస్తుంది. ఆ సంస్థ నుంచి వచ్చే ఆదేశాల మేరకు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తయిన విద్యుత్తును పంపిణీ లైసెన్సులతో పాటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లు కుదుర్చుకున్న సంస్థలు తీసుకుంటాయి.
అదనపు విద్యుత్తును విద్యుత్ మార్కెట్లో అందుబాటులో ఉంచుతారు. తద్వారా ఒప్పందాలు కుదుర్చుకోని సంస్థలు సైతం గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తయిన విద్యుత్తును వినియోగించుకోగల్గుతాయి. వేసవి విద్యుత్ డిమాండ్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ’ చైర్మన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేవలం గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల ద్వారా మాత్రమే కాకుండా ఇతర ప్రత్యామ్నాయ చర్యల ద్వారా కూడా విద్యుత్ డిమాండ్‌ను తీర్చాలని ప్రభుత్వం నిర్ణయించి, కొన్ని చర్యలు చేపట్టింది.
Summer hot weather