— ఇప్పటికే 80 శాతం పూర్తి
— ఇంకా 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉంది
— 8 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొత్తం పూర్తి
— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Paddy Procurement : ప్రజాదీవెన నల్గొండ : నల్గొండ జిల్లాలో గత రబీతో పోలిస్తే ఈ రబీలో 160 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుతో కలిసి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో రబీ ధాన్యం సేకరణ పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా జిల్లాలో ధాన్యం సేకరణ వివరాలను జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ జిల్లాలో ఈ రబీలో 5 లక్షల 57 వేల మెట్రిక్ టన్ను ధాన్యం వస్తుందని అంచనా వేయడం జరిగిందని, ఇప్పటివరకు 70 నుండి 80 శాతం ధాన్యాన్నీ కొనుగోలు చేశామని, సుమారు 5 లక్షల 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలియజేశారు. మరో 22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉందని చెప్పారు. గత సంవత్సరం ఇదే సమయానికి రబీలో 3 లక్షల 3498 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు 5 లక్షల 14 వేల 743 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 160 శాతం ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగులు, టార్పాలిన్ల సమస్యలు లేవని, మొదట్లో రైతులు ధాన్యాన్ని తూర్పార బట్టకుండా తీసుకురావడం వల్ల సమస్య ఉండేదని, ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవని వెల్లడించారు. జిల్లాలో 8 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొత్తం పూర్తికానున్నట్లు తెలిపారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఒకే మిల్లుకు పంపించకుండా జిల్లాలోని అన్ని మిల్లులకు సమానంగా పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల మిల్లర్లకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ధాన్యం సేకరణ పై పత్రికలలో వచ్చే ప్రతికూల వార్తలకు ఎప్పటికప్పుడు వివరణలు ఇస్తున్నామని, అంతేకాక తనతో పాటు, అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులు, తహసిల్దారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
–మంత్రులు మాట్లాడుతూ…
అంతకుముందు రాష్ట్ర పౌరసరఫరాలు,ఇరిగేషన్ శాఖ మంత్రి నాలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకించి ఈ రబీ సీజన్లో మాత్రం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. అందువలన రైతులెవరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే రబీలో ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని, ఈ సంవత్సరం రబీలో 57 లక్షల ఎకరాలలో వరి ధాన్యం సాగు చేయటం జరిగిందని, సన్నధాన్యం పండించిన రైతులను ప్రోత్సహించేందుకు గాను సన్నధాన్యానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నదని, ధాన్యం అమ్మిన రైతుల వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేసిన 48 గంటల్లో వారి బ్యాంకు ఖాతాలో ధాన్యం ఆమ్మిన డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. రానున్న పది, పదిహేను రోజులు జిల్లా యంత్రాంగం పూర్తిగా ధాన్యం సేకరణ పై దృష్టి పెట్టాలని, అవసరమైన చోట అదనపు లారీలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని, ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏవైనా అవసరం అయితే స్థానికంగా కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని, అలాగే మధ్యంతర గోదాంలను సైతం ఉపయోగించుకోవాలని చెప్పారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఎదురవకుండా జిల్లా కలెక్టర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, రానున్న వారం, పది రోజులు పూర్తి అప్రమత్తంగా ఉండి ధాన్యాన్ని సేకరించాలని చెప్పారు. వాతావరణాన్ని బట్టి జిల్లా అధికారులు ముందుగానే చర్యలు చేపట్టాలన్నారు. మిల్లర్లు తరుగు పేరుతో ధాన్యాన్ని తీయకుండా చూడాలన్నారు. కొన్నిచోట్ల ట్రాన్స్పోర్ట్ సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీని ద్వారా ధాన్యం కొనుగోలు జాప్యం జరగడానికి వీలులేదని అన్నారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దాన్యం సేకరణను జిల్లా అధికారులు సీరియస్ గా తీసుకోవాలని, 40 కేజీల బ్యాగు తక్కువగా వస్తున్నదని ఆరోపణలు ఉన్న దృష్ట్యా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ట్రాన్స్పోర్ట్ సమస్యలు లేకుండా ట్రాన్స్పోర్ట్ శాఖ తరఫున తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ ధాన్యం సేకరణకు సంబంధించి పత్రికలలో వ్యతిరేక వార్తలు వచ్చినప్పుడు తక్షణమే స్పందించి వివరణలు ఇవ్వాలని తెలిపారు. అంతేకాకుండా ముందుగానే ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రెస్ నోట్ ల ద్వారా సమాచారం అందించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, యజ్ఞంలా దాన్యం సేకరణ పెద్ద ఎత్తున చేయడం జరుగుతున్నదని, దీని ద్వారా ఎన్నో వేల మంది రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తున్నదని, ఇందుకుగాను పెద్ద ఎత్తున నిధులు కూడా ఖర్చు చేస్తున్నదని, ఏవైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని, ఆకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులు ఇబ్బంది పడకుండా ముందే సిద్ధంగా ఉండాలని, రాష్ట్రప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని సైతం ఈ సీజన్లో కొనుగోలు చేసేందుకు నిర్ణయించడం జరిగిందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనడమే కాకుండా, చెల్లింపులు కూడా వెంటనే చేయించడం జరుగుతున్నదని, రానున్న 15 రోజుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయదేవి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.