–సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచేత న్యాయవిచారణ చేపట్టాలి
–మధ్య భారతంలో నరమేధాని ఆపివేయాలి
–తక్షణమే శాంతి చర్చలు ప్రారంభించాలి
–ప్రజా సంఘాల డిమాండ్
— జిల్లా కేంద్రంలో నిరసన
Nambala Kesava Rao: ప్రజాదీవెన నల్గొండ : సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావును ఒరిస్సాలో అరెస్ట్ చేసి బూటకపు హత్య చేశారని, వెంటనే ఈ బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా బాధ్యులు సిహెచ్ సుధాకర్ రెడ్డి, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం సెంటర్ లో గురువారం నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుటకపు హత్యలు చేసి చంపిన 28 మందిలో ఆదివాసీ ప్రజలు, మావోయిస్టు పార్టీ సభ్యులు, నాయకులు ఉన్నారని ఆరోపించారు. చతిస్గడ్ రాష్ట్రం అబూజ్ మడ్ అడవుల్లో ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీలను, మావోయిస్టు సానుభూతిపరులను అత్యంత క్రూరంగా హత్య చేశారని అన్నారు.
బుధవారం సాయంత్రం మావోయిస్టు జాతీయ కార్యదర్శి కేశవరావును నిరాయుదుడిగా పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ అని కట్టుకథలు అల్లుతున్నారని, ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఖనిజ సంపదను ఇతర దేశాలకు తరలించడంలో భాగంగా ఆదాని, అంబానీలకు మూకుమ్మడిగా అడవిని కట్టబెడుతున్నారని, అందులో భాగంగానే ఈ నరమేధం జరుగుతుందని మండిపడ్డారు. ఆపరేషన్ కగార్ పేరుతో నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్, కొండగావ్, జిల్లాలతో పాటు తెలంగాణలో కర్రేగుట్ట తదితర అడవులను జల్లెడ పట్టి ఆదివాసీలను హననం చేయడం అత్యంత దుర్మార్గ చర్య అని ఆగ్రహ వ్యక్తం చేశారు. వెంటనే ఆపరేషన్ కగారును విరమించుకోవాలని, ఇప్పటికే మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ శాంతి చర్చలు జరుపకుండా కేంద్ర బలగాలతో ఏకపక్షంగా కాల్పులు జరిపి హత్య చేయడం సరైనది కాదని అన్నారు. స్వదేశీ పౌరులను పట్టుకొని కాల్చి చంపమని ఏ రాజ్యాంగంలో ఉందో ఈ దేశ ప్రధానమంత్రి, హోం మంత్రి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో బిజెపి మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ టెర్రరిస్టులతో చర్చలు జరిపి యుద్ధాన్ని విరమించింది కానీ, స్వదేశంలో పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడుతున్న మావోయిస్టులతో చర్చలకు మాత్రం సిద్ధంగా లేదని ఎద్దేవా చేశారు.
తక్షణమే వారితో శాంతి చర్చలు జరపాలని, ఆదివాసీల హననాన్ని ఆపాలని, ఇప్పటివరకు జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, జ్వాల వెంకటేశ్వర్లు, ప్రజాసంఘాల బాధ్యులు గూడూరు జానకిరామ్ రెడ్డి, కోమటిరెడ్డి అనంతరెడ్డి, గద్దపాటి సురేందర్, గోలి సైదులు, అయితగోని జనార్దన్ గౌడ్, సిహెచ్. దుర్గయ్య, పి వై ఎల్ జిల్లా కార్యదర్శులు , బివి చారి, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు బొంగరాల నరసింహ, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.