–మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
Alugubelli Narsi Reddy: ప్రజాదీవెన నల్గొండ : ప్రభుత్వ పాఠశాలలను ప్రజలే కాపాడుకోవాలని టిపిఎస్వి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ నుండి నాలుగు రోజులపాటు నిర్వహించే ప్రచార జాతను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటము జరిగిన ఈ నల్లగొండ గడ్డ నుండే ప్రచార జాతను ప్రారంభిస్తే బాగుంటుందని ఇక్కడి నుండి ప్రారంభిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా విద్యారంగం 90 శాతం పైగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 40 శాతం మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. దీనివలన చదువులో రోజు రోజుకు అంతరాలు పెరిగిపోతున్నాయని ఆవేదన చెందారు.
అంతరాలు లేని నాణ్యమైన చదువు అందరికీ సమానంగా అందాలంటే పాఠశాలలను రియార్గనైజ్ చేయాలని డిమాండ్ చేశారు. నేడు యువ దంపతులు గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థుల సంఖ్య నానాటికి పడిపోతున్నది. పట్టణ ప్రాంతాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున దానికి అనుగుణంగా ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వము రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి చైర్మన్ గా, ముగ్గురు సభ్యులతో నియమించిన తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్టు సూచించిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
బడి ఈడు పిల్లల సంఖ్య ఆధారంగా గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలని రీ ఆర్గనైజ్ చేయాలి. ఇతర ఆవాసాల నుండి బడికి రావలసిన విద్యార్థుల కొరకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి. నల్లగొండ లాంటి పట్టణాలలో నూతనంగా ఏర్పడిన వెంకటేశ్వర కాలనీ, శివాజీ నగర్, గాంధీనగర్ లాంటి ప్రాంతాలలో కొత్త బడులు ఏర్పాటు చేయాలి.కేంద్ర ప్రభుత్వము కేంద్ర బడ్జెట్లో విద్యకు 10శాతం కేటాయించాలి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతుల ఏర్పాటుకు కేంద్రం 500 కోట్లు ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలి. క్రమంగా అంతరాలు లేని బడులను అభివృద్ధి చేసి ఉన్నోడి పిల్లలయినా లేనోడి పిల్లలయినా ఒకే బడిలో, ఒకే తరగతి గదిలో చదువుకునే పరిస్థితిలు కల్పించాలి.కాగా ఈ ప్రచార జాత కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం. రాజశేఖర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. టి పి ఎస్ వి ప్రచార జాతలో పాల్గొన్నవారు.
రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, తెలంగాణ పౌర స్పందన వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షులు పాల్వాయి అంజిరెడ్డి, సూర్యాపేట అధ్యక్షులు ధనమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంగ, నాగమణి, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం. రాజశేఖర్ రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షులు బక్క శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, టాప్రా నల్లగొండ జిల్లా అధ్యక్షులు జగదీష్ చంద్ర, కార్యదర్శి శాం సుందర్, డివైఎఫ్ఐ నల్లగొండ అధ్యక్షులు మహేష్, టీఎస్ యుటిఎఫ్ నుండి యడ్ల సైదులు, నర్రా శేఖర్ రెడ్డి, గేర నరసింహ, నలపరాజు వెంకన్న, పగిళ్ళ సైదులు, కొమర్రాజు సైదులు, మురలయ్య తదితరులు పాల్గొన్నారు.