Amit Shah in Khammam Gummam todayనేడు ఖమ్మం గుమ్మంలో అమిత్ షా
-- రైతు గోస-బీజేపీ భరోసా సభకు హాజరు -- భారీ ఏర్పాట్లలో నిమగ్నమైన బీజేపీ శ్రేణులు
నేడు ఖమ్మం గుమ్మంలో అమిత్ షా
— రైతు గోస-బీజేపీ భరోసా సభకు హాజరు
— భారీ ఏర్పాట్లలో నిమగ్నమైన బీజేపీ శ్రేణులు
ప్రజా దీవెన/ హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వాస్తవానికి అంతకుముందు ఆయన తెలంగాణ టూర్లో స్వల్ప మార్పులు జరుగగా తొలుత కొత్తగూడెం చేరుకుని, ఆ తర్వాత ఖమ్మం వేదికగా తలపెట్టిన బహిరంగ సభలలో ప్రసంగించాల్సి ఉండగా సమాయాభావం కారణంగా ఆయన పర్యటనలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.
కొత్తగూడెం రాకుండా నేరుగా ఖమ్మం సభకే అమిత్షా హాజరుకానున్నట్టు అధికారికి ప్రకటన వెలువడింది.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమిత్ షా టూర్ ఖరారైంది. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఈ సభతోనే ఎన్నికల యుద్ధంలోకి దిగాలని బీజేపీ భావిస్తోంది. ఆగస్టు 27వ తేదీన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 3 గంటల 25 నిమిషాలకు ఖమ్మం చేరుకుంటారు.
ఆ తర్వాత ‘రైతు గోస-బీజేపీ భరోసా’లో పాల్గొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. అమిత్ షా సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని బీజేపీ తెలంగాణ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే టార్గెట్ గా అమిత్ షా ప్రసంగం ఉండే అవకాశం ఉంది.
ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో టికెట్లు దక్కని నేతలు బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో చాలా మంది నేతలు పార్టీలు మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ మారే నేతలను తమవైపు తీసుకువచ్చేందుకు కమలనాథులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.