ఆపరేషన్ కశ్మీర్‌పై మరోసారి దృష్టి
మోడీ ప్రమాణ స్వీకారం రోజే దాడి
జూన్ 29న అమరనాథ్ యాత్రకు పటిష్ట భద్రత
భద్రతా చర్యలపై హోం మంత్రి అమిత్ షా సమీక్ష
Amit Shah: ప్రజాదీవెన, ఢిల్లీ: కశ్మీర్‌లో (KASHMIR) ఉగ్ర భూతం మళ్లీ బుసలు కొడుతోంది. అమాయకులపై మారణ హోమానికి తెగబడుతోంది. దీంతో లోయలో కల్లోలం రిపీట్ అవుతోందా అనే భయం పుడుతోంది. మరి ముచ్చటగా మూడోసారి పవర్‌లోకి వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం. ఉగ్రవాదం అణచివేతపై ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయబోతోంది..? టెర్రరిస్ట్‌లను ఎగదోస్తోన్న దాయాది దేశానికి ఎలా కౌంటర్ ఇవ్వనుంది..? ఆపరేషన్ కశ్మీర్‌పై మరోసారి దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న జమ్ము కశ్మీర్‌లో (JAMMU KASHMIR) ఈ మధ్య మళ్లీ ఉగ్రదాడుల కలకలం నెలకుంటోంది. జూన్ 9వ తేదీన రియాసిలో బస్సుపై దాడి జరిగిన తర్వాత మరో మూడు చోట్ల ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడులన్నీ ఉగ్ర కదలికలు లేని గ్రామాల్లో జరగడం కలకలం రేపుతోంది. దీంతో టెర్రరిజంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
జమ్ము కశ్మీర్‌లో (JAMMU KASHMIR) శాంతిభద్రతల పరిరక్షణపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah). ఉగ్రవాదం అణచివేతకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు పలు మార్గదర్శకాలను జారీ చేశారు. జూన్ నెల 29వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కూడా అమిత్ షా సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో బలగాల మోహరింపు, చొరబాటు యత్నాలు తిప్పికొట్టడం, ఉగ్రవాద నిర్మూలనా కార్యకలాపాలపై కూడా అధికారులతో షా చర్చించారు. జమ్మూ కశ్మీర్‌లో (JAMMU KASHMIR) వరుస ఉగ్ర ఘటనలపై ప్రధాని మోదీ కూడా ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఉగ్రదాడులను తిప్పికొట్టడానికి పూర్తిస్థాయిలో భద్రతా బలగాలను రంగంలోకి దించాలని ఈ సందర్భంగా ప్రధాని ఆదేశించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ (NARENDRA MODI) ప్రమాణస్వీకారం రోజునే యాత్రికులే లక్ష్యంగా పర్యాటక బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడి సంచలనం సృష్టించింది.
ఈ దాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి పాల్పడింది తామేనంటూ పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబాకు అనుబంధం సంస్థగా ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. భవిష్యత్తులో మరిన్ని దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. ఆ ఘటన మరువక ముందే కఠువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్‌లో ఒక ఇంటిపై దాడి జరిగింది. దీంతో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్ అమరుడయ్యారు. దోడా జిల్లాలోని భదర్వా-పఠాన్‌కోట్ రహదారి సమీపంలోని ఒక చెక్‌పోస్టుపై జరిగిన దాడిలో.. రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు సిబ్బంది, ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. ఇదే జిల్లాలోని మరో ఘటనలో ఒక పోలీసు అధికారి గాయాలపాలయ్యారు. పూంఛ్, రాజౌరీ ప్రాంతాలతో పోలిస్తే.. రియాసీలో ఉగ్ర ఘటనలు తక్కువ. కానీ ప్రస్తుతం అలాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు పంజా విసురుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం (CENTRAL GOVERMENT)..ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపట్టింది.