–లబ్ధి పొందనున్న టీచర్లు, ఆయాలు
–నల్లగొండ జిల్లాలో 9 ప్రాజెక్టులు.. 2093 అంగన్వాడీ కేంద్రాలు
–జిల్లావ్యాప్తంగా 162 టీచర్లు..595 ఆయాల ఖాళీలు
— గత ఏడాదిగా 63 మంది టీచర్లు, 211 ఆయాల పదవి విరమణ
Anganvadi Centers : ప్రజాదీవెన నల్గొండ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల బలోపేతానికి చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు ఖాళీగా ఉన్న పోస్టలను భర్తీ చేయడం, అంగన్వాడీలకు గ్రేడింగ్ ఇవ్వడం, తదితరాలు చేపట్టనుండగా వారం కిందట టీచర్లు, సహాయకులకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలను పెంచుతూ ఆర్థికశాఖ అనుమతులు జారీ చేసింది. దీనికోసం కొన్నేళ్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న నిర్వాహకుల కల నెరవేరింది. వారి పదవి విరమణ ప్రోత్సాహకా లను రెండింతలు చేస్తూ అనుమతులు జారీ కావడంతో టీచర్లు, సహాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విరమణ సమయంలో టీచర్ కు రూ.2 లక్షలు, సహాయకులకు రూ. లక్ష చొప్పున అందించనున్నారు. కాగా ఇంతకాలం టీచర్ కు రూ. లక్ష, సహాయకులకు రూ.50 వేలు చొప్పున ప్రయోజనాలు అందాయి. ఎన్నికల హామీ మేరకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సాహకాలను పెంచింది. నల్గొండ జిల్లా పరిధిలోని 9 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ టీచర్లు 162 మంది, ఆయాలు 595 మంది లబ్ధి పొందనున్నారు.
–పోస్టుల భర్తీకి సన్నాహాలు..
జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్లు, సహాయకుల పోస్టుల భర్తీకి ఐసీడీఎస్ అధికా రులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో టీచర్లు పోస్టులు, సహాయకుల పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. ఈ రెండు పోస్టులకు కనీస విద్యార్హత ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా వ్యాప్తంగా 162 మంది టీచర్లు, 595 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. పోస్టుల భర్తీని ఏవిధంగా చేయాలనేది ఇంకా నిర్ణయించలేదు. గతంలో మార్కుల ఆధారంగా భర్తీ చేసేవారు. ఇప్పుడూ అలాగే చేస్తారా లేక రాత పరీక్ష పెడతారా అనేది నిర్ణయించాల్సి ఉంది. అంగన్ వాడీల గ్రేడింగ్, టీచర్, సహాయకుల వివరాల సేకరణ నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
—జిల్లాలో 9 ప్రాజెక్టులు…
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉండగా 2093 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి.ఈ కేంద్రాలలో 8391 ఆరు నెలల లోపు చిన్నారులు, ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల లోపు చిన్నారులు 44092 మంది, మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల లోపు చిన్నారులు 30447, గర్భిణీలు 8543 మంది, బాలింతలు 8391 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2093 మంది అంగన్వాడీ టీచర్లకు గాను ప్రస్తుతం 1931 మంది టీచర్లు పనిచేస్తుండగా 162 ఖాళీలు ఉన్నాయి. 1498 మంది ఆయాలు ఉండగా 595 ఖాళీలు ఉన్నాయి. కాగా గత సంవత్సర కాలంగా 63 మంది టీచర్లు, 211 మంది ఆయాలు పదవి విరమణ పొందారు.
ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఖాళీల భర్తీ…
కృష్ణవేణి (ఐసిడిఎస్ జిల్లా అధికారి నల్గొండ)
ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రాగానే సూచించిన నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ద్వారా ఖాళీల భర్తీ జరుగుతుంది. ఖాళీల భర్తీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు వెలువడ లేదు.