Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Anganwadi Vacancy: అంగన్వాడి కొలువులు..!

–ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు

–నేడు మహిళా దినోత్సవం రోజున నోటిఫికేషన్.?

–జిల్లాలో 153 మంది టీచర్లు, 642 ఆయాలు, 9 సూపర్వైజర్ల ఖాళీలు

— భర్తీతో మెరుగు పడనున్న కేంద్రాలు

–మారిన విద్యార్హత నిబంధ

Anganwadi Vacancy: గ్రామాల్లో ఆటాపాటలతో చిన్నారులను పాఠశాలకు అలవాటు చేయడం, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడానికి ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉండడంతో సరైన పోషకాహారం అందడంలేదు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సరిగా లేకపోవడం, వెక్కిరిస్తున్న ఖాళీలపై పత్రికల్లో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయా కేంద్రాల్లో ఖాళీ గా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల ను భర్తీ చేయడానికి నేడు మహిళా దినోత్సవం రోజున నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. దీంతో ఆయా పోస్టులకు మోక్షం కలుగనుంది. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మెరుగుపడనుంది.

–జిల్లాలో 9 ప్రాజెక్ట్ లు.. 2093 అంగన్వాడీ కేంద్రాలు

జిల్లా వ్యాప్తంగా 33 మండలాల్లో ఐసీడీఎస్ కింద 9 ప్రాజెక్టుల పరిధిలో 2093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 40,812 మంది చిన్నారులు, 4,668 మంది గర్భిణులు, 3,502 మంది బాలింతలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అంగన్వాడీ కేంద్రా ల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టి కాహారం అందిస్తుంటారు. కానీ ఆయా కేంద్రాల్లో ఏళ్లతరబడిగా ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయక పోవడంతో కొన్ని చోట్ల కేంద్రాలు తెరుచుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తం గా అంగన్వాడీ టీచర్ పోస్టులు 153 ఆయా పోస్టులు 642 ఖాళీలు ఉండడంతో పౌష్టికాహారం అందని ద్రాక్షగానే మిగిలింది. అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించే అధికారుల పోస్టులు సైతం భారీగానే ఖాళీ ఉన్నాయి.

నల్లగొండ జిల్లాలో అంగన్వాడీ సూపర్వైజర్లు 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో అంగన్ వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడింది. మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించడంతో ఖాళీలకు మోక్షం కలగనుంది. ఖాళీలను స్థానికులతో భర్తీ చేయాలని డిమాండ్ ఉంది. కాగా అంగన్వాడీ టీచర్ పోస్టుకు గతంలో పదవ తరగతి ఉత్తీర్ణత కావాలనే నిబంధ ఉండేది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాలు ప్రకారం అంగన్వాడీ టీచర్ తో పాటు ఆయా పోస్టు కు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలని నిబంధన ఉంది.

ప్రాజెక్టుల వారీగా ఖాళీలు…

నల్గొండ జిల్లాలో తొమ్మిది ప్రాజెక్టులు ఉన్నాయి. అనుముల ప్రాజెక్టు పరిధిలో 255 సాంక్షన్ పోస్ట్ లు ఉండగా 239 మంది టీచర్లు ప్రస్తుతం పనిచేస్తుండగా 16 ఖాళీలు ఉన్నాయి. అంగన్వాడి ఆయా పోస్టుల విషయానికొస్తే 255 మందికి 194 మంది విధులు నిర్వహిస్తుండగా 61 ఖాళీలు ఉన్నాయి. చింతపల్లి మండలానికి సంబంధించి 185 మంది టీచర్లకు 160 మంది పనిచేస్తుండగా 25 ఖాళీలు ఉన్నాయి. ఆయాలు 185 కు 119 మంది ఉండగా 66 ఖాళీలు ఉన్నాయి. దామరచర్ల మండలానికి సంబంధించి 251 మంది టీచర్లకు 242 మంది పనిచేస్తుండగా 9 ఖాళీలు ఉన్నాయి. ఆయాలు 251 కి 159 మంది ఉండగా 92 ఖాళీలు ఉన్నాయి.దేవరకొండ మండలానికి సంబంధించి 284 మంది టీచర్లకు 251 మంది పనిచేస్తుండగా 33 ఖాళీలు ఉన్నాయి. ఆయాలు 284 కు 187 మంది ఉండగా 97 ఖాళీలు ఉన్నాయి.

కొండమల్లేపల్లి మండలానికి సంబంధించి 179 మంది టీచర్లకు 152 మంది పనిచేస్తుండగా 27 ఖాళీలు ఉన్నాయి. ఆయాలు 179 కి 119 మంది ఉండగా 69 ఖాళీలు ఉన్నాయి. మిర్యాలగూడ మండలానికి సంబంధించి 211 మంది టీచర్లకు 197 మంది పనిచేస్తుండగా 14 ఖాళీలు ఉన్నాయి. ఆయాలు 211 కి 153 మంది ఉండగా 58 ఖాళీలు ఉన్నాయి.

మునుగోడు మండలానికి సంబంధించి 169 మంది టీచర్లకు 261 మంది పనిచేస్తుండగా 8 ఖాళీలు ఉన్నాయి. ఆయాలు 169 కి 112 మంది ఉండగా 47 ఖాళీలు ఉన్నాయి. నకిరేకల్ మండలానికి సంబంధించి 250 మంది టీచర్లకు 241 మంది పనిచేస్తుండగా 9 ఖాళీలు ఉన్నాయి. ఆయాలు 169 కి 112 మంది ఉండగా 47 ఖాళీలు ఉన్నాయి. నల్గొండ మండలానికి 309 మందికి సంబంధించి 297 మంది టీచర్లకు 241 మంది పనిచేస్తుండగా 9 ఖాళీలు ఉన్నాయి. ఆయాలు 309 కి 224 మంది ఉండగా 85 ఖాళీలు ఉన్నాయి.

ప్రభుత్వానికి నివేదించాం..

కృష్ణవేణి (ఐసిడిఎస్ పిడి నల్గొండ)

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. నల్లగొండ జిల్లాలో 153 అంగన్వాడీ టీచర్లు, 642 ఆయాలు,9 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.