డ్రోన్ ను కూల్చిన అధికారులు
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Ayodhya Ram Mandir: ప్రజాదీవెన అయోధ్య: అయోధ్యలోని రామమందిర పరిసరాల్లో అనుమానాస్పద డ్రోన్ ఎగురుతూ కనిపించడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా అధికారులు డ్రోన్‌ను నేలకూల్చారు. ఆలయానికి సమీపంలో ఇలాంటి ఘటనలు జరగడం భద్రతాపరమైన ఆందోళనలను రేకిత్తించింది.. వాస్తవానికి రామమందిర ప్రాంతంలో, ఆలయానికి దగ్గరగా డోన్లు ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిషేధం విధించింది.. అయితే, యాంటీ డ్రోన్ వ్యవస్థను పరీక్షిస్తున్న సమయంలో ఈ అనుమానాస్పద డ్రోన్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమై, డ్రోన్‌ను నేలకూల్చినట్లు ప్రకటించారు.
రామాలయం ప్రాంతంలో గందరగోళం సృష్టించేందుకు, పెద్ద సంఖ్యలో భక్తులను చంపేందుకు ఇది ఒక లోతైన కుట్ర అంటూ పేర్కొంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందన్న పోలీసులు మరిన్ని వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. ముందుగా, బాంబు నిర్వీర్య దళం డ్రోన్ కెమెరాను క్షుణ్ణంగా పరిశీలించి, ఎటువంటి భద్రతా ముప్పు లేదని నిర్ధారించిందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి రామ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. డ్రోన్ ను నేలకూల్చిన తర్వాత.. వెంటనే రంగంలోకి అధికారులు అనుమానిత వ్యక్తిని గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.. ప్రాథమిక విచారణలో, నిందితుడు హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిసింది.
ఆలయ భద్రతను మరింత మెరుగుపరిచేందుకు నూతన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలు నిర్ణయించాయి. రామమందిర పరిసరాల్లో డ్రోన్ల నిషేధాన్ని మరింత కఠినతరం చేస్తున్నట్లు భద్రతా అధికారులు ప్రకటించారు. ఆలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా డ్రోన్ ఎగురుతున్నా, యాంటీ డ్రోన్ వ్యవస్థ వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. రామమందిరం వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉండే కారణంగా, భద్రతా చర్యల్లో ఎటువంటి లోపం ఉండకూడదని.. ఈ ఘటన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు.