**బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎన్.వి.సుభాష్ **
N. V. Subhash BJP : ప్రజా దీవెన, హైదరాబాద్: ఓ పత్రికకు సంబంధించి 10వ వార్షికోత్సవ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులను హేళన చేసేలా మాట్లాడిన వ్యాఖ్యలను బిజెపి ఖండిస్తున్నది అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ తెలిపారు
స్వేచ్ఛా ప్రాధాన్యత ఉన్న నాలుగో స్థంభంగా ఉన్న మీడియా, జర్నలిస్టుల పట్ల హేళనగా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ ఆలోచనా ధోరణికి నిదర్శనం. ఇది గౌరవప్రదమైన వృత్తిని కించపరచే చర్య,ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టులు ఎన్నో కష్టాలను భరిస్తూ తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.
రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతూ “రాజ్యాంగాన్ని కాపాడాలి” అంటూ నీతులు చెబుతారు. అలాంటిది, అదే రాజ్యాంగంలో నాలుగో స్థంభంగా చెప్పబడిన మీడియాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? మీడియాపై కాంగ్రెస్ నేతలు నిరంకుశంగా మాట్లాడటం వారి అసలైన మనస్తత్వాన్ని చూపుతోంది.వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే మీడియాపై వివక్ష ఉంది. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ సమయంలో మీడియాను అణచివేసిన దాఖలాలు అందరికీ తెలుసు. ఇప్పుడు అదే ధోరణిని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి ప్రవర్తన ఎమర్జెన్సీ 2.0కి ముందుచూపు కావచ్చు.
జర్నలిస్టులలో లోపాలుంటే వాటిని నిర్మాణాత్మకంగా ఎదుర్కొని మార్గనిర్దేశం చేయాల్సింది ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బాధ్యత. కానీ జర్నలిస్టులను తక్కువచేసేలా, అగౌరవపర్చేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరం.
ఇదే ధోరణిని బీఆర్ఎస్ పార్టీ కూడా అనుసరిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కూడా మీడియాను తన శత్రువుగా మార్చుకుంది. ఇటీవల ఓ టీవీ ఛానల్ పై బీఆర్ఎస్ దాడులకు ఉసిగొల్పింది. మరో చానల్ కు బాహాటంగా బెదిరించింది. ఇది చూస్తే స్పష్టమవుతోంది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మీడియా అంటే సహనం లేదన్నది. ప్రజాస్వామ్యంలో ఈ ధోరణులు ప్రమాదకరం.