BRS councilors who joined the Congress: కాంగ్రెస్ లో చేరిన బి అర్ ఎస్ కౌన్సిలర్లు
-- ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో చేరిన వైస్ చైర్మన్, కౌన్సిలర్లు
కాంగ్రెస్ లో చేరిన బి అర్ ఎస్ కౌన్సిలర్లు
— ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో చేరిన వైస్ చైర్మన్, కౌన్సిలర్లు
ప్రజా దీవెన/హైదరాబాద్: నల్లగొండ నియోజకవర్గంలో అధికార బిఆర్ ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పొచ్చు. ఆ పార్టీకి చెందిన నల్లగొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తో పాటు పలువురు కౌన్సిలర్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తం కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఆగోతు ప్రదీప్ నాయక్, జేరిపోతుల అశ్విని భాస్కర్ గౌడ్, ఖాయ్యుం బేగ్, బషీరుద్దీన్, పబ్బు సాయి శ్రీ సందీప్ లు ఉన్నారు. వీరితోపాటు తిప్పర్తి మండలం రామలింగాలగూడెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ ముత్తినేని అనూష నగేష్ తో పాటు కనగల్ మండలానికి చెందిన పలువురు ఎంపీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలను బిఆర్ఎస్ కాపీ కొట్టిందని విమర్శించారు. బిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో మోసపూరితమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో బిఆర్ఎస్ పార్టీలో వణుకు పుట్టిందని అన్నారు. దీంతో సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కొత్త హామీలను ఇస్తున్నాడని ధ్వజమెత్తారు.
అధికారంలో ఉండి గతంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. దీనిపై ప్రచారానికి వచ్చే నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ స్కీములన్నింటినీ కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని, ఉద్యోగాలు అన్నింటిని భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీ స్కీములను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుప్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.