ఫిబ్రవరి 21వరకూ అవకాశం
Civil Service Exam: ప్రజాదీవెన, ఢిల్లీ: యూపీఎస్సీ యేటా నిర్వహించే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ నియామక పరీక్ష 2025 నోటిఫికేషన్ గత నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ పొడిగించింది. అఖిల భారత సర్వీసులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 21వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తాజాగా ప్రకటనల జారీ చేసింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 పరీక్షకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. జనవరి 22న మొదలైన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ తొలుత ఫిబ్రవరి 11తో ముగియగా.. అధికారులు ఆ తేదీని ఫిబ్రవరి 18వ తేదీ వరకు పొడిగించారు.
ఆ గడువు మంగళవారంతో ముగియడంతో తాజాగా మరోమారు గడువును పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. దరఖాస్తు గడువును ఫిబ్రవరి 21వరకు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజా నిర్ణయంతో అభ్యర్థులు ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం కలిగింది. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు సవరించుకోవచ్చని యూపీఎస్సీ తన ప్రకటనలో వెల్లడించింది. కాగా మొత్తం 979 సివిల్ సర్వీసెస్ పోస్టుల కోసం ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్టులకు కూడా దరఖాస్తు గడువు పొడిగిస్తూ యూపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ఈ పోస్టులకు సైతం దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 21, 2025వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు ఎదురుచూడకుండా ముందుగానే దరఖాస్తులు చేసుకోవాలని, చివరి రోజున సర్వర్ బిజీగా ఉండే ఛాన్స్ ఉందని యూపీఎస్సీ సూచించింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇతర వివరాలు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.