Concern among aspirants…! ఆశావహుల్లో ఆందోళన…!
-- బి అర్ ఎస్ లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం --మరికొద్ది సేపట్లో సీఎం కెసీఆర్ మీడియా సమావేశం
ఆశావహుల్లో ఆందోళన…!
— బి అర్ ఎస్ లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం
–మరికొద్ది సేపట్లో సీఎం కెసీఆర్ మీడియా సమావేశం
ప్రజాదీవెన/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ప్రధానంగా అధికార టిఆర్ఎస్ పార్టీలో అభ్యర్థుల ప్రకటన అంశం ఆశావాహులను ఆందోళనకు గురిచేస్తుంది. ఈరోజే మధ్యాహ్నం మరికొద్ది సేపట్లో టిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారుఅన్న వార్త మరింత ఉత్కంఠ భరిత వాతావరణాన్ని సృష్టిస్తుంది.
దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితా విడుదల కోసం గులాబీ పార్టీ ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ తొలి జాబితా ప్రకటన నేపథ్యంలో పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడుతుందోనన్న ఆత్రుత అందరిలో నెలకొంది.
ఈసారి అవకాశం లేనట్లేననే వార్తలతో టెన్షన్ పడుతున్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయర్, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే (మంత్రి) కొప్పుల ఈశ్వర్ తదితరులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి వారి ఆవేదనను వెలిబుచ్చారు.
ఉప్పల్ నుంచి టికెట్ ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఇప్పటికే ఆమెతో తన బాధను వెలిబుచ్చుకోగా అక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్న జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రెండోసారి కవితను కలిసి విన్నవించుకున్నారు.
ఇకపలువురు నేతల అభిప్రాయాలను తెలుసుకున్న కవిత ప్రగతి భవన్ చేరుకుని తండ్రి కేసీఆర్తో చర్చిస్తున్నారు. అక్కడే ఉన్న మంత్రి హరీశ్రావు అభిప్రాయాలను కూడా తెలుసుకుని ఫస్ట్ లిస్టుకు తుది మెరుగులు దిద్దే ప్రక్రియ మొదలైంది.
దాదాపు సిట్టింగ్ లందరికీ ఈసారి కూడా అవకాశం ఇస్తామని గతంలోనే ప్రకటించిన కేసీఆర్ పది స్థానాల్లో మార్పులు చేసినట్లు సమాచారం. పలు నియోజక మార్గాల్లో రెండు రోజులుగా జరుగుతున్న నిరసనలు, వ్యతిరే కతలు, పోటాపోటీ ప్రదర్శనలను దృష్టిలో పెట్టుకుని చివరి నిమిషంలో కేసీఆర్ ఏం మార్పులు చేస్తారన్నది ఆసక్తి కరంగా మారింది.
కాగా తెలంగాణ భవన్ దగ్గర పలు నియోజకవర్గాల నుంచి వచ్చిన గులాబీ నేతలతో సందడి వాతావరణం నెలకొన్నది. కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ భారీ సైజు ఫ్లెక్సీలు, కటౌట్లు వెలిశాయి. ఏదిఏమైనా మరికొద్ది సేపట్లో తొలి జాబితాను కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రకటిస్తారని అంతట ఆత్రుత అలుముకుంది.