–నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి
–14వ వార్డు మర్రిగూడ లో సీసీ కెమెరాలు ఏర్పాటు
–పాల్గొన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి
Nalgonda DSP Shivaram Reddy : ప్రజాదీవెన నల్గొండ : యువత గంజాయి సేవించిన, అమ్మిన జైలుకెల్లాక తప్పదని నల్గొండ డి.ఎస్.పి కె శివరాం రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం రాత్రి నల్గొండ పట్టణ పరిధిలోని 14వ వార్డు మర్రిగూడలో జేరిపోతుల అశోక్ గౌడ్ సహకారంతో రూ1.50 లక్షల తో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సిఐ రాఘవరావు, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మర్రిగూడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించిన అశోక్ గౌడ్ ను అభినందించారు.యువత చెడు మార్గాల వైపు మళ్లీ తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. గతంలో గంజాయి అమ్మిన వాళ్లని అరెస్టు చేశామని ఇప్పుడు గంజాయి సేవించిన వారిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
గ్రామంలో గంజాయి ఎవరెవరు సేవిస్తున్నారో పోలీసు శాఖ వద్ద వివరాలు ఉన్నాయని వివరించారు. ఇప్పటికైనా వారంతా గంజాయి సేవించడం మానుకోవాలని సూచించారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి సహకారంతో మర్రిగూడ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేశారు.
గ్రామాన్ని గంజాయి రహిత గ్రామంగా చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. యువత గంజాయి సేవిస్తూ గ్రామానికి చెడ్డ పేరు తీసుకురావద్దని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐ రాఘవరావు, రూరల్ సీఐ సైదా బాబా, మాజీ కౌన్సిలర్లు బొజ్జ శంకర్, జేరిపోతుల అశ్విని భాస్కర్ గౌడ్, జేరిపోతుల అశోక్ గౌడ్, గురిజ వెంకన్న, నాగిరెడ్డి, మహేష్, అనిల్ కుమార్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.