— పద్యానికి ఉద్యమ ఆవేశాన్ని జోడించి పోరాటం గావించిన కలం యోధుడు
–కవి రచయిత కృష్ణ కౌండిన్య
Krishna Koundinya poet : ప్రజాదీవెన నల్గొండ :తెలంగాణమంటే గుర్తుకొచ్చే కవి దాశరథి. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని పోరాటం చేసిన సేనాని. నిజాం నిరంకుశత్వం మీద అగ్నిధారను కురిపించి రుద్రవీణను మీటి నిద్రాణమైన తెలంగాణ ప్రజలను చైతన్య పరిచిన నిత్య చైతన్య శీలి అని కవి రచయిత, రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కృష్ణ కౌండిన్య అన్నారు.
ప్రజానీకానికి మైక్ అమర్చి ప్రజావాణిని వినిపించి రాచరిక వ్యవస్థను దిక్కరించిన కవి అని, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ సగర్వంగా తనువంతా తెలంగాణదనాన్ని ఆవహింప చేసుకున్న మహాకవి అని కొనియాడారు. మంగళవారం రాత్రి నల్లగొండ జిల్లా కేంద్రంలో ని యుటిఎఫ్ భవనంలో తెలంగాణ సాహితి ఉమ్మడి నల్లగొండ జిల్లా, యుటిఎఫ్
సంయుక్త ఆధ్వర్యంలో దాశరధి జయంతి సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
రాసిన కవిత్వమంతా పద్యం గేయం వచన కవిత రూపంలో ఉన్నప్పటికీ మొట్టమొదట పద్య కవిత్వాన్ని రాశారని, దాశరథి కవితా శక్తి పద్యాలలో ఉన్నట్లుగా ఇతర రూపాల్లో లేదని, స్వచ్ఛమైన పద్యానికి ఉద్యమ ఆవేశాన్ని జోడించి పోరాటం గావించిన కలం యోధుడని పేర్కొన్నారు. పద్యాన్ని ఆధునిక కవుల్లో ఆయుధంగా మలిచి ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించారని, దాశరథి కవిత్వం లో ప్రబంధ కవుల రచన శైలి కనిపిస్తుందని మహాకవి పోతన శైలిలా సరళంగా ఉంటుందని అన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా కవిత్వం ఒక ధారగా సాగుతుందని ఏ పద్యాన్ని ఎక్కడ వాడాలో దాశరధికి బాగా తెలుసునని పద్యం పాట మర్మం తెలిసిన కవి దాశరథి అని కొనియాడారు. అనంతరం సాహితి మేఖల అధ్యక్షులు పున్నా అంజయ్య మాట్లాడుతూ దాశరధి రాసిన తొలి గ్రంథం అగ్నిధారను చండూరు నుంచి సాహితీ మేఖల ప్రచురించి ఆవిష్కరించడం గర్వకారణం అన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దాశరధి ఆశించిన సమాజం కోసం పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది పేర్కొన్నారు. కవి, విమర్శకులు డాక్టర్ సాగర్ల సత్తయ్య మాట్లాడుతూ దాశరధి కేవలం పద్యం మాత్రమే కాక గొప్ప కథలు రచించారని అన్నారు. దాశరధి జీవించిన కాలమునాటి సామాజిక సాంస్కృతిక జీవనం దాశరధి కథల్లో ప్రతిబింబిస్తుంది అన్నారు.
కథా నవల రచయిత భూతo ముత్యాలు మాట్లాడుతూ తెలుగు సినిమా సాహిత్యంలో విలువలు నెలకొల్పిన ఘనత దాశరధికి దక్కుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన ఆచరణ సముద్ర గర్భం పాట తెలుగు సాహిత్యo ఉన్నంతకాలం నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, తెలంగాణ జీవకవి మునాసు వెంకట్, కవి రచయిత డా.పగడాల నాగేందర్, యోగా గురూజీ మాదగాని శంకరయ్య, సృజన సాహితి అధ్యక్షులు పెరుమాళ్ళ ఆనంద్, యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, ఉనికి సాహితి వేదిక అధ్యక్షులు బండారు శంకర్, తెలంగాణ సాహితి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎండి. హసేన, పుప్పాల మట్టయ్య, బూర్గు గోపికృష్ణ, పి.వెంకులు, చందంపేట ఎంఈఓ పగిడిపాటి నరసింహ, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గేర నరసింహ, న్యాయవాది నిమ్మల భీమార్జున్ రెడ్డి, దాసరి శ్రీరాములు, దాసరి ప్రభాకర్, నలపరాజు వెంకన్న , మోత్కూరు శ్రీనివాస్, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పగిళ్ల సైదులు కొమర్రాజు సైదులు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లo మహేష్, చింతపల్లి రవీందర్, వీరాచారి, నాగయ్య, గూండాల నరేష్ మొదలగువారు పాల్గొన్నారు.