Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Dhyan Chand Gupta: పార్టీల వారీగా మీడియా చీలిపోవడం విచారకరం

–హర్యానా శాసనసభాపతి ధ్యాన్ చంద్ గుప్తా
ఐ.జే. యూ. జాతీయ కౌన్సిల్ సమావేశాల ప్రారంభం

Dhyan Chand Gupta: ప్రజా దీవెన, చండీఘర్:దేశంలో మీడియా పార్టీల వారీగా చీలి పోవడం విచారకరమని , దాంతో ప్రజ లకు పూర్తి సమాచారం అంద టంలేదని హర్యానా శాసనసభాపతి ధ్యాన్ చంద్ గుప్తా (Dhyan Chand Gupta) విచారం వ్యక్తం చేశారు.ఇండియన్ జర్నలిస్ట్స్ యూని యన్ (Union of Indian Journalists) (ఐ.జే.యూ) జాతీ య కౌన్సిల్ సమావేశాల ప్రారంభ సదస్సులో స్పీకర్ ధ్యాన్ చంద్ గుప్తా ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. హర్యానా రాష్ట్రం పంచకుల నగరం ఒకటో సెక్టార్ లోని పి.డబ్ల్యూ.డి. విశ్రాంతి గృహ సమా వేశ మందిరంలో రెండురోజుల కౌన్సిల్ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి.

సమావేశాలకు చండీఘర్ హర్యానా జర్నలిస్ట్ యూనియన్ (Chandigarh Haryana Journalist Union)ఆతిధ్యం ఇచ్చింది. ప్రారంభ సభకు ఐ.జే.యు. జాతీయ అధ్యక్షుడు కే.శ్రీని వాస్ రెడ్డి అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథి ధ్యాన్ చంద్ గుప్తా మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో మీడియా కీలక భూమిక పోషిస్తున్నదని , ప్రభుత్వాలు సవ్యంగా నడవటానికి మీడియా ఇచ్చే సమాచారానికి ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా విస్తరించినప్పటికీ ప్రింట్ మీడియా (Print media)ప్రాధాన్యత తగ్గలేదని, ప్రజలకు సమాచారం ఇవ్వడంలో ప్రింట్ మీడియాకు ఇంకా సామర్థ్యం ఉందని అన్నారు. దేశంలో వస్తున్న మార్పుల గురించి అభివృద్ధి గురించి ప్రజలకు సమాచారం ఇవ్వడంలో ప్రింట్ మీడియా కృషి చాలా ఉందని అన్నారు.ఇటీవల కాలంలో ఫేక్ న్యూస్ ప్రమాదం పెరగడం బాధాకరమని అన్నారు. సంచలనాలు అవసరమేనని అయితే దాని పేరుతో నిర్ధారణ కాని వార్తలు ఇవ్వడం , అవాస్తవాలు ప్రచారం చేయడం సమంజసం కాదని ధ్యాన్ చంద్ గుప్తా (Dhyan Chand Gupta)అభిప్రాయ పడ్డారు.

ప్రతికూల , అనుకూల వార్తలు ఇవ్వడం ఆయా సంస్థల విధానం కావచ్చునని , అయితే వార్తల్లో వాస్తవాలు, సమతుల్యత అవసరమని ఆయన స్పష్టం చేశారు. చండీఘర్ హర్యానా జర్నలిస్ట్ యూనియన్ నాయకులతో తనకున్న చిరకాల అనుబంధాన్ని ఆయన గుర్తుచేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం ఉంటుందని అన్నారు.సమావేశాలకు ఆతిధ్యం ఇస్తున్న చండిఘర్ హర్యానా జర్నలిస్ట్ యూనియన్ కు ఆయన ఐదు లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

సమావేశంలో అతిథిగా పాల్గొన్న హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Haryana State) మీడియా సలహాదారు రాజీవ్ జైట్లీ (Rajiv Jaitley)మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి హర్యానా ప్రభుత్వం సానుకూలంగా ఉందని , యూనియన్ తమ దృష్టికి తెచ్చిన సమస్యలపై ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నామని , ఒక నెలరోజుల వ్యవధిలో అవి పరిష్కారం కాగలవని భరోసా ఇచ్చారు.

దేశంలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కుంటున్న సమస్యలపై చర్చించడంతో పాటు మీడియా స్థితిగతులపై కూడా యూనియన్ దృష్టి సారించాలని రాజీవ్ జైట్లీ (Rajiv Jaitley)విజ్ఞప్తి చేశారు.సమాచార ప్రపంచంలో తీవ్రమైన మార్పులు వచ్చిన నేపథ్యంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. సాంకేతికత , కృత్రిమ మేథ ప్రవేశించడంతో సమాచార ప్రసార మాధ్యమాలలో సాంకేతిక నైపుణ్యాలు పెరగడం మంచి పరిణామమన్నారు. ఒకప్పుడు మూడుగంటల సమాచారాన్ని ఓపిగ్గా వినేతరం ఉండేదని , ప్రస్తుతం ముప్పై సెకన్ల సమాచారం మాత్రమే వినే తరం వచ్చిందని అన్నారు.

ముప్పై సెకన్ల తరానికి మూడుగంటల సమాచారం ఇవ్వడం అతి పెద్ద సవాలని రాజీవ్ జైట్లీ (Rajiv Jaitley) అన్నారు. దాంతో సమాచారాన్ని వినోదంతో మేళవించాల్సిన పరిస్థితి తలెత్తిందని రాజీవ్ జైట్లీ (Rajiv Jaitley) వివరించారు.ఆ క్రమంలో పాత్రికేయులు సృజనాత్మక స్వేచ్చ తీసుకుంటున్నారని ఆయన అన్నారు.అయితే సృజనాత్మక స్వేచ్ఛ పేరిట పలు సందర్భాల్లో వాస్తవాలు వక్రీకరణకు గురవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.వాస్తవాలకు , వక్రీకరణలకు మధ్య చాలా అగాథం ఉంటోందని , దాన్ని అధిగమించడం జర్నలిజానికి పెద్ద సవాలుగా మారిందని అన్నారు. ఇండియన్ జర్నలిస్టు యూనియన్ దీనిపై దృష్టి సారించాలని కోరారు.వృత్తిలో అనుభవం , పరిణతి కలిగిన సీనియర్ పాత్రికేయులతో , సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతతో యూనియన్ (UNION) ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ప్రయత్నం చేయాలని సూచించారు.

తప్పుడు సమాచారంపై వివరణలు ఇచ్చే యాప్ ను రూపొందించాలని సూచించారు.ఐ.జే.యు. జాతీయ అధ్యక్షుడు కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని రద్దు చేసి తెచ్చిన లేబర్ కోడ్ వల్ల జర్నలిస్టుల వృత్తి భద్రత , వేతన భద్రత ప్రమాదంలో పడ్డాయని , జర్నలిస్టులకు దేశంలో ఉన్న కొద్దిపాటి హక్కులు కూడా పోయాయని వివరించారు.వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. హర్యానా ప్రభుత్వ ప్రచార సలహాదారు తరుణ్ భండారి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియాను నాలుగో స్థంభంగా పరిగణిస్తారని , మీడియా ప్రజల గొంతుకగా నిలవాలని అన్నారు. ప్రభుత్వాల వల్ల జరిగే తప్పులను , పొరపాట్లను ఎత్తి చూపించే బాధ్యత మీడియాపైనే ఉందని అన్నారు. పాత్రికేయులకు పది లక్షల రూపాయల ప్రమాద బీమాను సొంతంగా చండీఘర్ హర్యానా జర్నలిస్ట్ యూనియన్ అమలు చేయడం హార్షణీయమని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ చేస్తున్న ప్రయత్నాలకు తాము సహకరిస్తామని తరుణ్ భండారి హామీ ఇచ్చారు.సమావేశాల ప్రారంభంలో చండీఘర్ హర్యానా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రామ్ సింగ్ బ్రార్ స్వాగతం పలికారు.

సమావేశంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ(IJU General Secretary Balwinder Singh Jammu), స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్.ఎన్. సిన్హా, దేవులపల్లి అమర్ , హర్యానా యూనియన్ చైర్మన్ బల్వంత్ తక్షి , చండీఘడ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నళినీ ఆచార్య , ఐజేయు జాతీయ కార్యదర్శి బల్ బీర్ సింగ్ ఝాండు , తదితరులు ప్రారంభ సభలో మాట్లాడారు. యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఎ. మాజిద్ , జాతీయ ఉపాధ్యక్షులు అమర్ మోహన్ ప్రసాద్, జాతీయ కార్యదర్శులు వై.నరేందర్ రెడ్డి, డి.ఎస్.ఆర్. సుభాష్, డి.సోమసుందర్ తదితరులు వేదికపై ఉన్నారు.
దేశం నలుమూలల నుండి పద్దెనిమిది రాష్ట్రాల అనబంధ సంఘాలకు చెందిన జాతీయ కౌన్సిల్ సభ్యులు , రాష్ట్రాల అధ్యక్ష కార్యదర్శులు , ప్రతినిధులు రెండువందల మంది హాజరయ్యారు.